దుబ్బాక,డిసెంబర్16: ఎన్నికలేవైనా గెలుపు గులాబీదేనని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, భరోసా కార్యక్రమం నిర్వహించారు. రెండో విడతలో దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దుబ్బాక, మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి, తొగుట, చేగుంట,నార్సింగ్ మండలాల్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ దుబ్బాక మరోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టిందన్నారు.
కేసీఆర్ అంటే దుబ్బాక ప్రజలకు ఎనలేని అభిమానమన్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు దుబ్బాక ప్రజలు బీఆర్ఎస్కు అండగా ఉన్నారని గుర్తుచేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి పెట్టాయన్నారు. రైతు సంక్షేమంతో పాటు పేదల సంక్షేమానికి బీఆర్ఎస్ అధిక ప్రాధాన్యం కల్పించిందని గుర్తు చేశారు. కేసీఆర్ సర్కారులోనే గ్రామాలు అభివృద్ధికి నోచుకున్నాయన్నారు. ఇందుకు గ్రామీణ ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్కే జై కొట్టారని తెలిపారు.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల మనుస్సుల్లో కేసీఆర్, బీఆర్ఎస్ సుస్థిరంగా ఉందన్నారు. రా్రష్ట్రంలో అధికంగా 88 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్‌లు గెలిచిన నియోజకవర్గంగా దుబ్బాక ప్రత్యేకత చాటుకుందన్నారు. ఇందుకు నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. విజయం సాధించిన బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్, వార్డు సభ్యులు ఇదే ఉత్సాహంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఇందుకు తమవంతు సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, బీఆర్ఎస్ నాయకులు మనోహర్‌రావు, రొట్టే రాజమౌళి, వెంకటనర్సింహారెడ్డి, ఎల్లారెడ్డి, రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌రావు, శ్రీనివాస్, వంశీ, బీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షులు శ్రీనివాస్, జీడిపల్లి రవి, రాంరెడ్డి పాల్గొన్నారు.