సిద్దిపేట, జనవరి 28( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కంది రైతులకు రంది పట్టుకుంది. పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులకు తిప్పలు తప్పడం లేదు. రైతులకు దన్నుగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోనట్లుగా వ్యవహనిస్తున్నది. పంట సాగు మొదలు.. పంట అమ్మకం వరకు రైతులకు ఇబ్బందులే ఎదువుతున్నాయి. పంట పండించడం రైతుకు ఒక ఎత్తయితే.. ఆ పంటను అమ్ముకోవడానికి రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన కంది పంట చేతికి వచ్చినా రైతులకు సంతోషం లేకుండా పోయింది. ప్రభుత్వం కొర్రీలు పెట్టి సేకరణను ఆలస్యం చేస్తుండడంతో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. వారం పది రోజలుగా కొనుగోలు కేంద్రాల వద్దనే కంది రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈసారి ఎకరాకు 3.30 క్వింటాళ్ల వరకే కంది పంటను సేకరించాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎకరాకు సరాసరిగా 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నది. దీంతో మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపై రైతులు మండి పడుతున్నారు.
వేల ఎకరాల్లో సాగు…
సిద్దిపేట జిల్లాలో ఈసారి కంది 6500 ఎకరాల్లో సాగైంది. జిల్లా వ్యాప్తంగా పంట దిగుబడి చేతికి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో కోత పనులు నడుస్తున్నాయి. నెల రోజుల ముందే కంది పంటను కొనుగోలు చేయాలని రైతుల పక్షాన ప్రభుత్వానికి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు లేఖ రాశారు. దీంతో ఈనెల 17న కంది కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట మార్కెట్ యార్డులో ప్రారంభించారు. జిల్లాలో సిద్దిపేటతో పాటు చేర్యాలలో కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. క్వింటాల్‌కు రూ. 7,550 మద్దతు ధరను రైతులకు చెల్లిస్తున్నారు. ఇదే సమయంలో కంది రైతులకు అనేక అంక్షలను ప్రభుత్వం పెట్టింది. ఎకరాకు 3.30క్వింటాళ్ల వరకే కొనుగోలు చేయాలని కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది.ఎకరాకు ఎంత లేదన్నా 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నది. కంది చేను దెబ్బతింటే దిగుబడి 4 నుంచి 5 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ, ప్రభుత్వం పరిమితులు విధించడంతో రైతులు దిగులు చెందుతున్నారు.
నత్త నడకన కొనుగోళ్లు…
జిల్లాలో కందుల కొనుగోళ్లు నత్తనడకన జరుగుతున్నాయి. వారం పది రోజుల నుంచి రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తేమ శాతం పేరిట రైతులను ఇబ్బంది పెడుతున్నారు. కంది కోతలు పూర్తి అవుతుండడంతో మార్కెట్‌కు రైతులు కందులు తీసుకు వస్తున్నారు. ఇప్పటి వరకు కొంతమంది రైతుల కందులు మాత్రమే కొనుగోలు చేశారు. ఎక్కువ శాతం మార్కెట్లోనే కందులు ఉండిపోతున్నాయి. నానా కొర్రీలు పెడుతూ కందులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ శాతం సరిగ్గా లేదని అధికారులు కందులను కొనుగోలు చేయడం లేదని రైతులు తెలిపారు. వారం రోజులుగా కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నామని, రోజు కందులను ఆరబోస్తూ అక్కడే ఉంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.