పటాన్చెరు రూరల్, జూన్ 30: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం ఐడీఏలో సిగాచీ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 12మంది కార్మికులు మృతి చెందగా మరో 34మంది కార్మికులు వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మూడు అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయింది. శిథిలాల కింద పలువురు కార్మికులు ఉన్నట్లు సమాచారం.
సంగారెడ్డి జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి 10 ఫైరింజిన్లు తెప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. హైడ్రా బృందం, ప్రకృతి విపత్తుల నివారణ బృందాలు శ్రమిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్. రెస్క్యూఫోర్స్ టీం, ఎస్‌జీఆర్‌ఎఫ్, డీడీఆర్ఎస్, ఫోరెనిక్స్ ల్యాబ్ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చాయి. పాశమైలారంతో పాటు ఇస్నాపూర్ వరకు అతిపెద్ద పేలుడు తీవ్రత ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ప్రజలు భూకంపం వచ్చిందని భావించినా భారీగా పొగలు వ్యాపించడంతో పరిశ్రమలో ప్రమాదంగా గుర్తించారు. మొదటి షిప్టునకు, జనరల్ షిప్టునకు కలిపి 149 మం ది కార్మికులు వచ్చినట్లు తెలుస్తున్నది.
సరిగ్గా ఉదయం 9.15 సమయంలో సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతతో పలువురు కార్మికులు గాలిలోనే ఎగిరిపడ్డారు. మరికొందరు మంటలో కాలిబుడిదయ్యారు. పేలుడు ధాటికి పరిశ్రమ బయట నిలిపిన వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు సమాచారం మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. పాశమైలారంలోని పలు పరిశ్రమలకు పోలీసులు ఫోన్ చేసి పదికి పైగా అంబులెన్స్‌లు, 10 ఫైర్ ఇంజిన్లను రప్పించారు.
పేలుడు తీవ్రతతో మూడంతస్తుల భవనం కూలింది. శిథిలాల్లో పెద్ద ఎత్తున్న కార్మికులు ఉన్నారని గుర్తించి రెస్క్యూఆపరేషన్కోసం ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూఫోర్స్, ఎస్‌జీఆర్‌ఎఫ్, డీడీఆర్ఎస్ బృందాలను రప్పించా రు. మొదట్లో ఈ బృందాలు లోపలికి వెళ్లలేకపోయాయి. మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత లోపలి నుం చి మృతదేహాలను బయటకు తెచ్చారు. స్లాబ్‌లు కూలిన చోట రెస్క్యూ బృందాలు పలువురిని కాపాడేందుకు ప్రయత్నం మొదలుపెట్టాయి. క్షతగాత్రులను తొలుత బస్సుల్లోనే దవాఖానలకు పంపించారు. ఆ తర్వాత అంబులెన్స్‌లు రావడంతో వాటిలో కాలిన, గాయపడిన కార్మికులను పంపించారు.
149మంది వరకు కార్మికులు, స్టాఫ్ లోపలికి వచ్చారనే విషయంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి కలెక్టర్ పి. ప్రావీణ్య, ఎస్పీ పారితోష్ పంకజ్ ఎంతమంది విధులకు వచ్చారో జాబితా ఇవ్వాలని కోరినా పరిశ్రమ వర్గాల నుంచి స్పందన కరువైంది. చివరికి 149 మంది వచ్చారని అటెండెన్స్ జాబితా చూపించారు. స్లాబ్ కింద ఉన్నవారిని కాపాడేందుకు క్రేన్లు, జేసీబీలు, కట్టింగ్ మెషిన్లు తెప్పించారు. రెవెన్యూ యంత్రాంగం మిస్సింగ్ అయిన వారి వివరాలు సేకరిస్తున్నది. 12 మంది చనిపోయారు. 34 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
పరిశ్రమలో ఫస్ట్నకు, జనరల్ షిప్ట్‌నకు వచ్చిన కార్మికుల వివరాలు ఇచ్చేందుకు అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. మృతిచెందిన వారి వివరాలు కూడా లేవు. కొందరు కార్మికులు కాలిబుడిద కావడంతో వారిని గుర్తించలేని దుస్థితి ఉంది. దవాఖానలో చాలా మంది చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబాల వారు వస్తే వారిని పోలీసులు, అదనపు బలగాలు దూరంగా పంపించాయి. పరిశ్రమ వద్ద లా అండ్ ఆర్డర్ అదుపు తప్పకుండా చూడాలన్నదే ధ్యేయంగా కొనసాగింది.
మధ్యాహ్నం వరకు తమవారు ఎక్కడున్నారో చెప్పాలని పలువురు పోలీసులు, అధికారులను వేడుకున్నారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ, కార్మికమంత్రి వివేక్ వచ్చి ప్రమాద తీవ్రతపై వివరాలు సేకరిస్తున్న సమయంలో కొందరు బాధిత కుటుంబాల సభ్యులు లోపలికి చొచ్చుకొని వస్తే వారిని పోలీసులు నిలువరించారు. తమ కుటుంబ సభ్యులు గల్లంతై నాలుగు గంటలవుతున్నా వారు బతికున్నారా? లేరా అనేది చెప్పకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పటాన్చెరు, జూన్ 30: పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ రసాయన ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి తీవ్రంగా గాయాలైన కార్మికులు పలు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. బొరిగుట్టు వేమసుందర్(45), ధర్మరాజు పాశ్వాన్ (29), రాజేశ్‌కుమార్ చౌదరి(52), కామలేశ్ ముఖియా (50), చందన్‌కుమార్ నాయక్(31), తారక్ పాదుటుబ్(50), సంజవ్ కుమార్ (47), యశ్వంత్‌కుమార్ (32), దవేర్కుమార్ దాస్( 35), సంజయ్ముఖితీయ (38), రాజశేఖర్‌రెడ్డి,( 42), దేవ్చంద్ కుమార్ చౌవాన్ (21), దణేశ్ కుమార్ (31) సంజవ్కుమార్యాదవ్ (30), నీలంబార్పాటర్ (19), సమీర్పాడి (26), అమర్జింత్ సాద్ (34), అర్జున్ కుమార్(29), అంజీం అనుసారి(34), ములమాడ దివ్య (24), బీదేశ్ (40), జీతేందర్ సరోజ్( 27), గంగాముఖియా (35), మున్మున్ చౌదరి (48), మామిళ్లు సుశీయ (24), దీవరక్ బసాక్ (24), భీంరావు (30), సీత్రన్ బట్టు (18), మేవాలాల్ సింగ్ (36), ఎండీ గౌస్ (47), ఆరీఫ్ (26), డబ్ల్యూ(28), అభిషేక్ (28), అభిలాష్‌రెడ్డి (31) దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.