గజ్వేల్, జూన్ 16: ప్రభుత్వం ప్రతి నెలా పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని ఈ నెల ఒకేసారి మూడు నెలలకు సంబంధించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. పౌర సరఫరాలశాఖ ద్వారా రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన బియ్యంలో ఎక్కువ శాతం నూకలు ఉండడంతో లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో 570 రేషన్‌కార్డులు ఉన్నాయి. అయితే గ్రామానికి చెందిన డీలర్ లక్ష్మారెడ్డి రేషన్ దుకాణానికి అధికారులు మొదటి విడతలో 150 క్వింటాళ్ల సన్న బియ్యం పంపించారు.
వాటిలో చాలా వరకు బియ్యం బస్తాల్లో తుట్టెలు పట్టి ఉండడంతో పాటు నూకలతో కూడిన సన్నబియ్యం రావడంతో లబ్ధిదారులు ఆ బియ్యాన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. సుమారు 15 తుట్టెలు, నూకలతో కూడిన బియ్యం బస్తాలు వచ్చాయి. ఇంకా 80 బస్తాల వరకు పంపిణీ చేయాల్సి ఉండగా అందులో కూడా ఇలాంటి బస్తాలు ఉండొచ్చని రేషన్ డీలర్ తెలిపారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. దీంతో రేషన్ డీలర్లు పంపిణీ చేసే సమయంలో ఇబ్బందులు పడుతుండగా లబ్ధిదారులు గంటల తరబడి దుకాణాల వద్ద వేచి ఉంటున్నారు.