బెజ్జంకి, జూలై 13: మండలంలోని పోతారం, గుగ్గిళ్ల గ్రామాల శివారులో ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని మూసివేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఇథనాల్ పరిశ్రమ మూసివేయాలని కోరుతూ సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన తహసీల్ కార్యాలయం ముట్టడిలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇథనాల్ పరిశ్రమల నుంచి వెలువడే విషవాయువులు, వ్యర్థాల వల్ల నేడు ప్రజల జీవనం అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు పరిశ్రమలను ఏటీఎంలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు చనిపోతున్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం వల్లనే నేడు అఖిలపక్షం నాయకులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నారన్నారు.
మాజీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రజా సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదని మండిపడ్డారు. శాంతియుత వాతావారణంలో చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారితే అధికారులే బాధ్యత వహించాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో తవ్విన కాల్వలు నీరు లేక ఎండిపోతుంటే అదే కాల్వల్లో పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థజలాలు వదలడం వల్ల చేపలు, పశువులకు ప్రాణసంకటంగా మారిందన్నారు. ప్రజల పక్షాన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సైతం ముట్టడిస్తామన్నారు. చేపలు, పశువులు చనిపోతుంటే అధికార పార్టీ నాయకులు తహసీల్ కార్యాలయం ముట్టడి రాకపోవడం అంతర్యమేమిటో అందరికీ తెలుసు అని విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో అసెంబ్లీని సైతం ముట్టడిస్తామన్నారు. మండలంలోని రెండు పరిశ్రమలు పెట్టి జీవవిధ్వంసం చేయడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో ప్రాజెక్టులు చేపట్టి వ్యవసాయ రంగానికి సాగునీరు, మత్స్యకారుల ఉపాధికి ఉచితంగా చేప పిల్లలు అందించామని గుర్తుచేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుంచి అఖిలపక్షం నాయకులు, ఎమ్మార్పీఎస్, స్వేరోస్, ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, డీఎస్పీ, ఎమ్మార్పీఎస్, స్వేరోస్, ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు.