గజ్వేల్, మార్చి 24: పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకు కేసీఆర్ రంజాన్ తోఫా ఇచ్చేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దానిని బంద్ చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సాయంత్ర గజ్వేల్ మదీనా మసీద్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముందుగా కేసీఆర్ తరపున మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. 16 నెలల కాలంలో మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేసిందో నాకంటే మీకే బాగా తెలుసన్నారు.
మైనార్టీల సంక్షేమానికి కేసీఆర్ ఎంతగానో కృషిచేశారని, తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న నుంచి ఏటా ఇక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నట్లు తెలిపారు. మైనార్టీల కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన గురుకులాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల్లో విలీనం చేస్తున్నదన్నారు. దీంతో మైనార్టీ గురుకులాలకు ఉన్న గుర్తింపు పోయే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ మైనార్టీ వర్గానికి చెందిన మహమూద్ అలీకి డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవి వంటి కీలక పదవులు ఇచ్చి గౌరవించారని, కాంగ్రెస్ కేబినేట్లో మైనార్టీలకు చోటు కల్పించలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు బాగాలేవని. చాలాచోట్ల గొడవలు జరుగుతున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బడ్జెట్లో మైనార్టీల కోసం రూ.3వేల కోట్లు కేటాయించి, రూ.వెయ్యి కోట్లు విడుదల చేసి అవి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. దీనిపై తాను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయాన్ని హరీశ్‌రావు ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్‌లో రూ.4కోట్లతో మదీనా మసీద్ ఫంక్షన్‌హాల్, షాదీఖానా నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
ప్రజ్ఞాపూర్, తూప్రాన్‌తో పాటు జిల్లా అంతటా ఖబ్రస్థాన్ల పనులు చేపట్టామని, కేసీఆర్ మంజూరు చేసిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు నిలిపివేసిందని, ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. విందులో ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు జుబేర్‌పాషా, విరాసత్ అలీ, జాఫర్‌ఖాన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మసీద్ కమిటీ అధ్యక్షుడు మతిన్, మాజీ అధ్యక్షుడు యూసూఫ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, నాయకులు ఉమార్, రియాజ్, కరీం, లతీఫ్ పాల్గొన్నారు.