Ramayampet | రామాయంపేట రూరల్, మార్చి07 : మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భూగర్బ జలాలు అడుగంటడం, అప్రకటిత విద్యుత్ కోతల వల్ల వరి పొలాలు ఎండిపోయే దశకు చేరాయి.ఈ సారి ఎక్కువ మొత్తం రైతులు వరి సాగు చేశారు. కానీ ఎన్నో ఆశలు పెట్టుకొని పంటలు వేసిన రైతులకు చేదు అనుభవం ఎదురైంది. ఒకవైపు భూగర్బ జలాలు అడుగంటడం, మరోవైపు కరెంటు కోతల వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో నీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వ్యవసాయ పొలాల వద్ద నీరు పారిస్తున్నారు. ఎన్నడు లేని విధంగా ఈ సారి తాము ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నడు ఎండని బోరు ఎండుతోంది..యువ రైతు, శ్రీకాంత్‌రెడ్డి, ప్రగతి ధర్మారం.
నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా బోరు పోయడం తగ్గలేదు. ఈ సారి మాత్రం ఒక్కసారిగా నీరుపోయడం తగ్గింది. నేను నాలుగు ఎకరాల్లో వరి వేశాను. ఇప్పుడు అది చేతికి వస్తుందో రాదో తెలియదు. చుట్టు పక్కల గ్రామాలకు కెనాల్ ద్వారా నీరు అందుతుంది. మాకు కూడా ఒక మార్గం ద్వారా కాళేశ్వరం కాలువ వచ్చింది. మిగతా మార్గాలకు వచ్చే క్రమంలో ప్రభుత్వం మారింది.
కాంగ్రెస్ అంటేనే కష్టాలు..రైతు,నర్సయ్య, శివాయిపల్లి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిన ఏదో ఒక కష్టం రావడం జరుగుతుంది. ఎన్నో ఏండ్ల నుంచి చూస్తున్నా. కేసీఆర్ వచ్చిన తర్వాత వ్యవసాయం ఎంతో మంచిగా చేసినాం.సాగు నీరు, కరెంటు కష్టాలు పూర్తిగా పోయినయ్. ముఖ్యంగా రాత్రిపూట పొలాల వద్దకు పోయే పరిస్థితి ఎప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. భూగర్బ జలాలు అడుగంటడం, కరెంటు కోతల వల్ల పగలు, రాత్రి పొలాల వద్దనే ఉంటున్నాం.రైతులు దేవుడు కేసీఆర్ ఆయన వస్తే మా బతుకులు మారుతాయి.
రైతుల గురించి పట్టింపే లేదు..రైతులుఎరుకల రాములు,టంకరి బాలయ్య, సుతారిపల్లి.
ప్రభుత్వం రైతుల గురించి పట్టింపే లేదు. భూగర్బ జలాలు అడగంటడం ఒక సమస్య అయితే ప్రయత్యామ్నాయ మార్గాలు చూడకపోవడం మరో సమస్య. మా గ్రామ శివారు నుంచి కెనాల్ వెళ్లింది. దాన్ని కనీసం గ్రామంలో ఉన్న చెరువు కుంటలకు మళ్లిస్తే బాగుండు. కానీ ఆ ఆలోచన చేయడం లేదు. ఇప్పటికైనా భవిష్యత్‌లో ఇలాంటి సమస్య రాకుండా చూడాలి.