సిద్దిపేట, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలోని రామలింగేశ్వర స్వామి ఆలయ భూములకు రక్షణ కరువైంది. కొందరు ఆలయ భూములకు ఎసరు పెట్టారు. ఏకంగా రికార్డులు మార్చేసి పట్టాలు చేయించుకుని దర్జాగా అనుభవిస్తున్నారు. రెవెన్యూ శాఖలోని అవినీతి అధికారుల అండదండలతో భూకబ్జాదారులు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఆలయానికి దాతలు ఇచ్చిన మూడెకరాల భూమి మాయమైపోయింది. అంతేకాకుండా ఆలయ భూముల హద్దులు చెరిపేస్తూ ఆక్రమణకు యత్నిస్తున్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి ఆలయ భూములను కాపాడాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు.
ఆలయ భూములను రక్షించాల్సిన అధికారులు లంచాలకు అలవాటు పడి ఏకంగా పట్టాలే మార్చేశారు. దానం చేసిన భూమి కొన్నేండ్ల వరకు ఆలయం పరిధిలో ఉంది. రాను రాను ఆ భూమిపై నేతల కన్ను పడింది. దాతల నుంచి విరాళంగా వచ్చిన మూడెకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాలేదు. ఇదే అదునుగా భావించి, ఆ భూమిని కొంతమంది వ్యక్తులు ఏకంగా తమ పేరిట పట్టా లు చేసుకొని రికార్డులు మార్చుకున్నారు. ఈ విషయం రికార్డులను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తుంది. గుట్టకు ఆనుకుని ఉన్న మూడెకరాల స్థలం ప్రస్తుతం ఉన్న 289ఇ ఖాతా నంబర్ 0.18 గుంటలు, 289ఎఫ్ ఖాతా నంబర్ 2.24 గుంటలు మొత్తం కలిసి 3.02 గుంటలు స్థలం రికార్డులను పరిశీలించి ఆ పట్టాలు రద్దుచేయాల్సిన అవసరం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు.
దాతలు కోరిన ప్రకారంగా రామలింగేశ్వరస్వామి పేరుమీద పట్టామార్పిడి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆలయ భూమిని అమ్మినా, కొన్నా చట్టప్రకారం చెల్లదని దేవాదాయ శాఖ చట్టం చెబుతోంది.ఆలయ అభివృద్ధికి పాటు పడాల్సిన వారు ఆలయ భూములను కబ్జా చేయడం ఏమిటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రామలింగేశ్వర స్వామి దేవస్థానం బెకల్ పేరు మీద ఆ భూమిని పట్టాచేసి హక్కులు పూర్తిగా ఆలయానికి చెందేలా పట్టాపాస్ పుస్తకాలతో పాటు ధరణిలో చేర్చాలని ప్రభుత్వం, దేవాదాయ శాఖ సంచాలకులు, కలెక్టర్‌ను భక్తులు, గ్రామస్తులు కోరుతున్నారు.
బెక్కల్ రామలింగేశ్వర స్వామి ఆలయ భూములు కబ్జాకు గురైతే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నట్లు..? ఆలయ భూములకు పరిరక్షణ వారికి పట్టదా అని ప్రజలు, భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఆధీనంలో ఉన్న భూములు హద్దులు చెదిరిపోతున్నాయి. నలుదిక్కులా హద్దులు జరుగుతున్నాయి. ఇటీవల అధికారులు చేసిన సర్వేలో సైతం ఈ విషయం తేటతెల్లమైంది. ఆలయ భూమికి సంబంధించిన రికార్డుల్లో ఉన్న 21 ఎకరాల 8గంటల భూమి వాస్తవంగా మోకాపై లేదు, సమీప రైతులు ఆలయ భూముల్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. పక్కనే ఉన్న వ్యక్తి ఎకరం భూమి హద్దులు దాటి ఆలయ భూమిలోకి వచ్చాడు.
రాను రాను ఈ ఎకరం కూడా ఇతరుల వశం అయ్యే అవకాశం ఉంది. ఇంకోవైపు అర ఎకరం వరకు ఇదే పరిస్థితి ఉంది. గతంలో సర్వేయర్లు ఏర్పాటు చేసిన హద్దులను సమీప రైతులు చెరిపివేస్తున్నారు. దాతల నుంచి విరాళంగా వచ్చిన మూడెకరాల భూమి ఇప్పటి వరకు రెవె న్యూ రికార్డుల్లో నమోదు కాలేదు. ఇదే అదునుగా భావించిన కొంతమంది అక్రమంగా రికార్డుల్లోకి మా ర్చుకొని, అనంతరం దానిని అమ్ముకున్నారు. ఈ తతంగంలో స్థానిక రెవెన్యూ అధికారులు, కొంతమంది బడానేతల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మహిమాన్విత బెక్కల్ రామలింగేశ్వర స్వామి ఆలయానికి దాతలు ఇచ్చిన మూడెకరాల భూమికి సంబంధించి ఇప్పటికే రికార్డులు మారిపోయాయి. ఆలయానికి ఉన్న మరో 21 ఎకరాల 8గుంటల భూమిని సైతం వదిలిపెట్టకుండా సమీప వ్యక్తులు హద్దుల్లోకి చొచ్చుకు వస్తుండడంతో అన్యాక్రాంతం అవుతున్నాయి. రామలింగేశ్వర స్వామి ఆలయ గుట్టకు ఆనుకుని ఉన్న మూడెకరాల 2 గుంటల భూమిని 1982లో బైరాన్‌పల్లికి చెందిన రాముని చంద్రయ్య తండ్రి వీరయ్య, రాముని రామయ్య తండ్రి చిన్నలింగయ్య విరాళంగా ఇచ్చారు.
వారి సొంత పట్టా కలిగిన సర్వేనెంబర్ 289లో ఉన్న సుమారు 3 ఎకరాల 2 గుంటల భూమిని ఈ ప్రాంత భక్తుల సౌకర్యార్థం ధర్మశాల నిర్మాణానికి వారి ఇలవేల్పు రామలింగేశ్వర స్వా మి ఆలయానికి దాన పూర్వకంగా రాసి ఇచ్చారు. అప్పటి నుంచి ఆలయానికి వచ్చే భక్తులు ఆ భూమిలో వంటలు చేసుకోవడానికి వాడుకుంటున్నారు. ఆలయానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం పోచమ్మకు మొక్కులు చెల్లించిన తర్వాత ఇక్కడే వంటలు చేసుకొని భోజనాలు చేసి వెళ్తుంటారు. దాతలు ఇచ్చిన భూమిలో వసతి గృహం కూడా ఉండేది. 25 ఏండ్ల కిందట ఆలయానికి, గ్రామానికి తాగునీటి సౌకర్యార్థం అందులో బావిని తవ్వించారు. వీటితోపాటు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, భక్తుల సౌకర్యార్థం హ్యాండ్ బోర్ పంపు ఉంది.