మెదక్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): వానకాలం పంటల సాగు ప్రణాళికను మెదక్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వానకాలంలో ఎరువుల కొర త లేకుండా పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారు. మరో వైపు సొసైటీలు, డీలర్ల వద్ద డీఏపీ, యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువుల నిల్వలపై వ్యవసాయ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారులు రోజు వారీగా పర్యటించి తమ పరిధిలో ఉన్న డీలర్ల వద్ద ఎరువుల నిల్వలను తనిఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారు.
మెదక్ జిల్లాలో ప్రధాన పంట వరి. ఈ వానకాలంలోనూ రైతులు వరిసాగుపై మొగ్గు చూపుతుండడంతో ఈసారి విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా బోరు బావులు, చెరువుల కింద 90 శాతం మంది రైతులు పంటలు పండిస్తున్నారు. నీటి వనరులు అధికంగా ఉండడంతో రైతులు ప్రతిఏడాది వరి పంటపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈసారి వర్షాలు త్వరగానే వస్తాయనే సంకేతాలతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు.
వానకాలం సీజన్ ప్రారంభానికి ముందు 50శాతం విత్తనాలు, ఎరువులు మార్కెట్లో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎరువులకు సంబంధించి ప్రతి రైతూ తప్పనిసరిగా పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒరిజినల్స్‌తో పాటు జిరాక్స్ తీసుకెళ్తేనే సబ్సిడీపై ఎరువులు అందజేస్తారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు తప్పకుండా ఆ దుకాణదారు నుంచి బిల్లులు తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.
వానకాలంలో మెదక్ జిల్లా వ్యాప్తంగా 3.73 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. వరి 3,27,113 ఎకరాల్లో సాగు కానుండగా, పత్తి 40,619 ఎకరాలు, మొక్కజొన్న 2,820 ఎకరాలు, కందులు 1,125 ఎకరాలు, పెసర 1,027 ఎకరాలు, మినుములు 383 ఎకరాలు, జొన్న 71 ఎకరాలు, సోయాబీన్ 76 ఎకరాలు, ఇతర పం టలు 147 ఎకరాల్లో పంటలు పండించనున్నారు.
మెదక్ జిల్లాలో వానకాలం పంటల సాగుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. 3,73,509 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు కూ డా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తు న్నాం. గత వానకాలంలో 3.43 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈసారి 3,73 లక్షల ఎకరాల్లో సాగ య్యే అవకాశం ఉన్నది.