వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారని ఎమ్మెల్సీ వంటేరి యాదవరెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి కూడవెల్లి, హల్దీవాగులోని చెక్‌డ్యామ్‌లు నింపితే, ఆయా ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయానికి కొంతమేర అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ఈ అంశాన్ని పరిశీలించాలని అధికారులను కోరారు.
సిద్దిపేట, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని, ఆరుతడి పంటలు సాగు చేయాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేదని, ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం రిజర్వ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఇరిగేషన్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది.
సమావేశానికి ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ… ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు కొత్తగా నీరు చేరలేదన్నారు. భారీ వర్షాలు కురిసే వరకు ప్రాజెక్టుల్లోని నీటిని తాగునీటి అవసరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సాగునీటి లభ్యత లేనందున, రైతులు వరి వేయొద్దని, ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
గతేడాది ఏడాది సిద్దిపేట జిల్లాలో 4.82 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, అందులో 3.68 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినట్లు తెలిపారు. సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొని, ప్రభుత్వం రూ.1200 కోట్లకు పైగా చెల్లించిందన్నారు.ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులపై రైతులకు ముందస్తుగా అవగాహన కల్పించడంతో ఇప్పటి వరకు సుమారు 70 వేల ఎకరాల్లో పంట మార్పిడి జరిగిందని తెలిపారు.
కందులు, పెసర్లు, మినుములు, చిరుధాన్యాలు, మొకజొన్న, పత్తి తదితర ఆరుతడి పంటలను రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు.ఆగస్టు 15 తర్వాత ఆముదం, పత్తి, ఇతర నూనెగింజల పంటలను సాగు చేసుకునే అవకాశం ఉందని, రైతులు పరిస్థితులకు అనుగుణంగా తకువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ శాఖ సిద్ధంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పంపిన లేఖను కలెక్టర్ ఈ సమావేశంలో చదివి వినిపించారు. గోదావరి నది నుంచి వృథాగా సముద్రంలోకి వెళ్లే నీటిని లిఫ్ట్ చేసి జిల్లాలోని ప్రాజెక్టులను నింపాలని హరీశ్‌రావు లేఖలో కోరినట్లు ఆమె వివరించారు. ప్రాజెక్టులను నింపడం ద్వారా రైతులకు సాగునీరు అందించడంతో పాటు భూగర్భ జలాలను పెంచే అవకాశం ఉంటుందని, రైతులను ఆదుకునేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి తెలియజేయాలని కోరినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సమావేశంలో కరీంనగర్ సరిల్ సీఈ సత్యనారాయణ రెడ్డి, సిద్దిపేట, గజ్వేల్, కరీంనగర్ సరిళ్ల ఎస్ఈలు సూర్యకిరణ్, లక్ష్మణ్ పల్లంరాజు, జిల్లా ఇరిగేషన్ అధికారి నాగరాజు, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, రామ్మూర్తి, జిల్లా వ్యవసాయ అధికారి మల్లయ్య, జిల్లా ఉద్యానవన అధికారి సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వివరా లను సమావేశంలో గజ్వేల్ సరిల్ చీఫ్ ఇంజినీర్ శివధర్మతేజ వెల్లడించారు. అన్న పూర్ణ సాగర్‌లో 3.50 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి 1.51 టీఎంసీల నీరు ఉండగా, డెత్ స్టోరేజ్ 0.32 టీఎంసీలు పోను సుమారు 1.19 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు.
రంగనాయక సాగర్‌లో 3.00 టీఎంసీలకు 0.99 టీఎంసీల నీరు ఉండగా, 0.17 టీఎంసీల డెత్ స్టోరేజ్ పోను 0.82 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని తెలిపారు. 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్లో ప్రస్తుతం 13.86 టీఎంసీల నీరు ఉందని, అందులో డెత్ స్టోరేజ్ ను మినహాయిస్తే సుమారు 4.12 టీఎంసీల నీరు వినియోగానికి అందుబాటులో ఉందన్నారు.
కొండపోచమ్మసాగర్‌లో 15.00 టీఎంసీలకు 6.31 టీఎంసీల నీరు ఉందని, 2.20 టీఎంసీల డెత్ స్టోరేజ్ పోను 4.11 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వివరించారు. శనిగరం ప్రాజెక్టులో 1.09 టీఎంసీలకు 0.46 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ప్రస్తుతం కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియో గించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిందని అధికారులు తెలిపారు.