రామచంద్రాపురం, జూలై 13: రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులకు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఇక్రిశాట్లో రాష్ట్రస్థాయి వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, నీటిపారుదల, భూగర్భజలాలు, విద్యుత్, వాతావరణ తదితర అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో కంటింజెన్సీ ప్లానింగ్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో ప్రస్తుత వర్ష్షపాతం, ఎల్‌నినో ప్రభావం, వర్షాలు, ఆలస్యమయ్యే అవకాశాలు, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం, భూగర్భ జలాల లభ్యత, ఖరీఫ్ పంటలపైన ప్రభావం, రైతులకు అందించాల్సిన సాంకేతిక సూచనలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ చర్యలు తదితర అంశాలపైన విస్తృతంగా చర్చించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మాట్లాడుతూ జూలై 15, 30, ఆగస్టు 15తేదీలను ప్రామాణికంగా తీసుకొని మూడు దశల్లో కంటింజెన్సీ ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని రైతులకు ముందస్తుగా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
వర్షాలు ఆలస్యమైనా లేదా తక్కువ కురిసినా రైతులు ఇబ్బందులు పడకుండా వరికి బదులుగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, వేరుశనగా, పెసలు, మినుములు, కందులు, సజ్జలు, జొన్నలు వంటి తక్కువ నీటి పంటల సాగు ప్రోత్సహించాలని సూచించారు. తక్కువ కాల వ్యవధిలో దిగుబడి ఇచ్చే స్వల్పకాలిక విత్తనాలను అందుబాటులో ఉంచాలన్నారు. వ్యవసాయ సహకార శాఖ ప్రభుత్వ కార్యదర్శి సురేంద్రమోహన్, ఉద్యాన, సెరీకల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా, స్పెషల్ కమిషనర్ రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ రాహుల్‌రాజ్, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.