చిన్నకోడూరు, ఆగస్టు 22: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో రైల్వేస్టేషన్ ఏర్పాటైతే వాణిజ్య, వ్యాపార పరంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి సాధ్యమవుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ అన్నారు. చిన్నకోడూరులో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బీఆర్ఎస్ ఎంపీలకు ఉత్తరం రాయడంతో శుక్రవారం చిన్నకోడూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్, హరీశ్‌రావు ఫ్లెక్సీకి గ్రామస్తులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేలేటి రాధాకృష్ణశర్మ మాట్లాడుతూ.. హరీశ్‌రావు కృషితోనే చిన్నకోడూరుకు రైల్వేస్టేషన్ మంజూరైనట్లు తెలిపారు.
ఇది ఎంతో సంతోషకర విషయం అన్నారు. కేసీఆర్, హరీశ్‌రావు కృషితోనే సిద్దిపేటకు రైలు వచ్చిందన్నారు. సిద్దిపేట, గుర్రాలగుందిలో మాత్రమే రైల్వేస్టేషన్లు గతంలో ప్రతిపాదించారని, చిన్నకోడూరుకు రైల్వేస్టేషన్ కావాలని ఈ ప్రాంత ప్రజలు కోరగా, హరీశ్‌రావు ప్రత్యేక చొరవ తీసుకొని బీఆర్ఎస్ ఎంపీలతో కలిసి రైల్వే మంత్రిని కలిసి విన్నవించినట్లు తెలిపారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చి, భూసేకరణ చేయడంతో మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ పట్టాలెక్కినట్లు తెలిపారు. చిన్నకోడూరులో ఏర్పాటు చేయనున్న రైల్వేస్టేషన్‌తో మండల ప్రజలకే కాకుండా ఇల్లంతకుంట, బెజ్జంకి మండలాల వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని రాధాకృష్ణ శర్మ అన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాముని శ్రీనివాస్, కనకరాజు, పిన్నింటి అబ్బిరెడ్డి, మేడికాయల వెంకటేశం, ఏమిరెడ్డి భూమిరెడ్డి, జంగిటి శ్రీనివాస్, కొండం రవీందర్ రెడ్డి, ఉమేశ్ చంద్ర, ఇట్టబోయిన శ్రీనివాస్, భూమిరెడ్డి, జంగిటి శ్రీనివాస్, మెడికాయల వెంకటేశం, కొండం రవీందర్ రెడ్డి, రాజశ్రీ, అమరేందర్‌రెడ్డి, కాల్వ ఎల్లయ్య, సదక్, సూరగోని రవి, దుర్గారెడ్డి, రాజిరెడ్డి, వైకుంఠం, మధుసూదన్‌రెడ్డి, భానుచందర్, ప్రధాన కార్యదర్శి మన్నే ఆనంద్, యువ నాయకులు మిట్టపల్లి సుధాకర్, కొలను రఘువర్మ, మిట్టపల్లి గణేశ్, పెసరు భాసర్, రాజయ్య, జానకి చందు, గొల్లపల్లి రాజశేఖర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.