న్యాల్కల్, సెప్టెంబర్ 15: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని జహీరాబాద్-బీదర్ ప్రధాన ఆర్అండ్బీ రోడ్డు అధ్వానంగా మారి వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. నిత్యం ఈ రోడ్డు మీదుగా వేలాది వాహనాల రాకపోకలు సాగిస్తాయి. ఈ రోడ్డు మార్గంలో తొమ్మిది కిలో మీటర్ల మేర మరమ్మతులు చేపట్టేందుకు బీఆర్ఎస్ ప్రభు త్వం స్టేట్ఫండ్ కింద రూ. 320 లక్షల నిధులు మంజూరు చేసింది.
కానీ, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఈ రోడ్డుకు నేటికి మరమ్మతులు నోచుకోవడం లేదు. న్యాల్కల్ మండలంలోని కొత్తూరు(బి) నారింజవాగు ప్రాజెక్టు నుంచి మెటల్కుంట గ్రామ చౌరస్తా వరకు ఉన్న రోడ్డు మార్గంలో మోకాళ్లలోతు గుంతలు ఏర్పడ్డాయి. ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. గుంతల రోడ్డుపై వాహనాలు అదుపుతప్పి నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
వా హనాలు దెబ్బతింటున్నాయని వాహనచోదకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిళ్లు ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రమాదాలకు గురై పలువురు మృతిచెందగా, మరికొందరు తీవ్రగాయాలైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని వాహనచోదకులు, ప్రజలు కోరుతున్నారు.