సిద్దిపేట, జనవరి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన గ్రామసభలు రచ్చరచ్చ అయ్యాయి. ఇందిరమ్మ ఇండ్లు తమకు ఎందుకు రాలేదు..? రేషన్ కార్డులు ఎందుకు రాలేదు..? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్డు ఏది..? ప్రభుత్వ విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు ఎందుకు లేవు..? రుణమాఫీ ఎందుకు చేయలేదు..? రైతు భరోసా ఏది..? ఇలా గ్రామసభల్లో ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. రేవంత్ సర్కార్‌కు ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రజలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అనర్హులకే సంక్షేమ పథకాలు అందిస్తారా..? ఏ ప్రతిపాదికన జాబితాను సిద్ధం చేశారంటూ అధికారులను నిలదీశారు. నిరుపేదలకు అన్యాయం చేశారంటూ తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న తమకు ఎందుకు రాలేదంటూ అధికార యం త్రాంగంపై, ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని గ్రామాల్లో పోలీస్ పహారా మధ్యన, ప్రజల నిరసన మధ్యన మొదటిరోజు మంగళవారం తూతూమంత్రంగా గ్రామసభలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రజలు భగ్గుమన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల లక్ష్మీపూర్‌లో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను గ్రామస్తులు నిలదీశారు. ఎన్నికల ముందు మీరు ఏం హామీలు ఇచ్చారు.. ఇప్పుడు చేస్తున్నది ఏంటి అంటూ తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేయలేదు.. రైతుబంధు ఏదీ అంటూ రైతులు ఎమ్మెల్యేను నిలదీశారు. కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేర్లు ఎందుకు రాలేదంటూ హుస్నాబాద్, మద్దూరులో పలువురు మహిళలు అధికారులను నిలదీశారు.
నంగునూరు మండలం పాలమాకులలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తమ పేర్లు లేవంటూ పలువరు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని కొంతమందిని అక్కడి నుంచి పంపించి పోలీస్ పహార మధ్యన గ్రామ సభను నిర్వహించారు. ఇల్లు మంజూరు కాలేదని అన్నందుకు బాధితుడిని పోలీస్‌లు గ్రామసభ నుంచి బయటకు పంపారు. ఎన్సాన్‌పల్లిలో అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీశారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామసభ రచ్చ రచ్చ అయ్యింది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం ఖలీల్ పూర్లో నిర్వహించిన గ్రామ సభల్లో మహిళలకు రూ.2500 ఏవి అంటూ అధికారులను నిలదీశారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఏది అంటూ అధికారుల తీరుపై మండిపడ్డారు. బొల్లారం మండలంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. సంగారెడ్డి మండలం ఇరిగిపల్లిలో గ్రామస్తులు లేకుండా కాంగ్రెస్ నాయకులతోనే గ్రామసభను తూతూమంత్రంగా జరిపించి మమ అనిపించారు.
ప్రజాపాలన గ్రామసభలకు మొదటిరోజు మంగళవారం జిల్లాకు చెందిన మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ మొహం చాటేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ ఎక్కడా హాజరు కాలేదు. గ్రామ సభలకు హాజరైతే తమను ఎక్కడ ప్రజలు నిలదీస్తారో అని డుమ్మా కొట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మెదక్ నియోజకవర్గంలో నిర్వహించిన గ్రామ సభలకు హాజరు కాలేదు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరు కాగా, గ్రామ సభల్లో ప్రజలు నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు మొదటి రోజు జరిగిన గ్రామసభల్లో స్పష్టంగా తెలిసింది.