గుమ్మడిదల, ఫిబ్రవరి 12: సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం గుమ్మడిదల మున్సిపాలిటీలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి-765డీ పై గొర్రెలు, మేకలతో నిరసన తెలిపారు. మొన్న బర్రెలు, నిన్న గొర్రెలతో నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. గుమ్మిడిదల మున్సిపాలిటీలో రెండోరోజు బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. బుధవారం తహసీల్దార్ గంగాభవానీ దీక్షా శిబిరం వద్దకు వచ్చి ఆందోళకారులకు డంపింగ్ యార్డుపై అవగాహన కలిగించడానికి ప్రయత్నించింది. తహసీల్దార్‌ను రైతు జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ.. డంపింగ్‌యార్డు ఏర్పాటుతో తమ బతుకులు ఆగమైతాయన్నారు. కాలుష్యంతో ఊర్లను విడిచి పోవాలా అని తహసీల్దార్‌ను నిలదీశారు.
ప్రజాభిప్రాయం లేకుండా అటవీప్రాంతంలో డంపింగ్‌యార్డు ఏర్పాటు చేయడం తగదన్నారు. ఎట్టి పరిస్థితిలో డంపింగ్‌యార్డు ఏర్పాటు కానివ్వమమని తేల్చిచెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గుమ్మడిదల, నల్లవల్లి, కొత్తపల్లిలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపారు. పార్టీ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి డంపింగ్‌యార్డు పనులు నిలిపివేసేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. కొత్తపల్లి, నల్లవల్లిలో నిరాహార దీక్షలు బుధవారం 8వ రోజుకు చేరాయి. గ్రామంలో మ హిళలు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, ఆలయకమిటీ అధ్యక్షుడు మద్దులబాల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పుట్టనర్సింగ్రావు, గుమ్మడిదల, బీజేపీ జిన్నారం మండల అధ్యక్షుడు ఐలయ్య, జగన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వంగేటి ప్రతాప్‌రెడ్డి, అండూర్ నర్సింగ్‌రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు చిమ్ముల నర్సింహారెడ్డి, ఆలేటినవీనా శ్రీనివాస్‌రెడ్డి, దోమడుగు శంకర్, ఆంజనేయులు,రామప్ప, జేఏసీ నాయకులు ఫయాజ్ షరీఫ్, కుమ్మరి ఆంజనేయులు, మధు, మల్లేశ్‌గౌడ్, కుల సంఘాలు, మహిళాసంఘాలు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
హైకోర్టు ఆదేశాలతో పనులు నిలిపివేత
నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్నాటు పనులను సర్వే కారణంగా తాత్కాలికంగా నిలిపి వేసినట్లు తహసీల్దార్ గంగాభవానీ తెలిపారు. ప్యారానగర్‌కు చెందిన కొందరు తమ భూముల్లో డంపింగ్‌యార్డు పనులు చేపడుతున్నారని హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో సర్వేచేసే వరకు డంపింగ్‌యార్డు పనులు నిలిపివేశామని, ఈనెల 13వ తేదీ నుంచి 19 వరకు సర్వేచేసి హద్దులు సూచిస్తామని తహసీల్దార్ తెలిపారు. అనంతరం యథావిధిగా పనులు కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు. డంపింగ్‌యార్డుపై మండల ప్రజలకు అపోహలు, భయాలు ఉన్నాయని, పూర్తిగా యూరోపియన్ టెక్నాలజీతో జీరో వేస్ట్‌తో వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్ ప్రాజెక్ట్ అని తహసీల్దార్ తెలిపారు. దీనిని రాంకీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తుందన్నా రు. దీనిపై అపోహలు పోవడానికి దుండిగల్ శివారులోని గడ్డపోతారంలో ఉన్న రాంకీ వేస్ట్మేనేజ్మెంట్కు తీసుకుపోయి అపోహలు తొలిగించడానికి ప్రయత్నిస్తామని ఆమె తెలిపారు.