గుమ్మడిదల,ఫిబ్రవరి17: సంగారెడ్డి జిల్లా పార్యానగర్లో జీహెచ్ఎంసీ డంపింగ్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. 13 రోజులుగా వినూత్నంగా ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గుమ్మిడిదలలో మహిళలు, యువకులు, రైతు సంఘం సభ్యులు, ఆలయకమిటీ సభ్యులు డప్పుచప్పుళ్ల మధ్య జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డంపింగ్‌యార్డు అనుమతులు రద్దు చేయాలంటూ తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
అనంతరం హైవేపై రైతు జేఏసీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. గుమ్మడిదలలో 7వ రోజు రిలే నిరాహార దీక్షలో విశ్వబ్రాహ్మణులు కూర్చున్నారు. నల్లవల్లి, కొత్తపల్లి గ్రామాల్లో 13 రోజు రిలే నిరాహార దీక్షలో మహిళలు పాల్గొన్నారు. తాము చేస్తున్న ఆందోళనలపై కాంగ్రెస్ సర్కారు స్పందించక పోవడంపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డంపింగ్‌యార్డు ఏర్పాటు పనులు ఆపే వరకు తాము ఆందోళనలు చేపడతామని వారు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఆందోళనల్లో రైతు సంఘం అధ్యక్షుడు సదానందరెడ్డి, ఆలయకమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, మహిళా జేఏసీ అధ్యక్షురాలు మల్లమ్మ, జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, హుస్సేన్, రాంరెడ్డి, ఆంజనేయు లు, భాస్కర్, మొగులయ్య, మాజీ సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గుండగళ్ల వెంకటేశ్, ఫయాజ్షరీఫ్, కుమ్మరి ఆంజనేయులు, సత్తయ్య, రామకృష్ణ, శంకర్ పాల్గొన్నారు.