మోదీ వ్యాఖ్యలపై గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు
దిష్టిబొమ్మలు దహనం
పాల్గొన్న ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్/ కొండపాక/ జగదేవ్‌పూర్/ ములుగు, ఫిబ్రవరి 9: గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మతో భారీ ర్యాలీలు నిర్వహించి, ప్రధాన కూడళ్లలో దహనం చేశారు. గజ్వేల్ పట్టణంలో ఎఫ్ఢీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ, ఎంపీపీ అమరావతి, నాయకులు, కార్యకర్తలంతా స్థానిక ఇందిరాపార్కు చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీఎం మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సరిగా జరుగలేదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయాక తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు, తాగునీటితో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడం పీఎం మోదీ, బీజేపీ చూసి ఓర్వలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. మళ్లీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కొండపాక మండలం దుద్దెడలో పార్టీ మండలాధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేయగా, కార్యక్రమంలో రైతుబంధు కన్వీనర్ ర్యాగళ్ల దుర్గయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగదేవ్‌పూర్, ములుగు మండలాల్లో జరిగిన నిరసనల్లో జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ములుగు ఆత్మకమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నరేశ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కావ్యదర్గయ్య, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, నాయకులు మహేందర్, సురేందర్‌రెడ్డి, కనకయ్య, శ్రీశైలం, ఆంజనేయులు, రవి, ములుగు మండలాధ్యక్షుడు, వంటిమామిడి ఏఎంసీ చైర్మన్ జహంగీర్, ఎంపీపీ లావణ్య అంజన్‌గౌడ్,జడ్పీటీసీ జయమ్మ అర్జున్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, జిల్లా కోఆప్షన్ సభ్యుడు సలీం, వైస్ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, నాయకులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.