హుస్నాబాద్, నవంబర్ 22: వానకాలం పంటలు దాదాపుగా రైతుల చేతికందాయి. వానకాలం వరికోసిన రైతులు నారుమడులు దున్ని మొలక అలికేందుకు సన్నద్ధ్దమవుతున్నారు. కొందరు రైతులు ఇప్పటికే నారుమడులు సిద్ధంచేసి నార్లు పోశారు. యాసంగిలో వరిపంటనే కాకుండా మొక్కజొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ పంటలు వేసే ముందు భూసారాన్ని బట్టి దున్నిన పొలంలో, దుక్కిలో సరైన ఎరువులు, సేంద్రియ ఎరువులను వాడితేనే పంటల దిగుబడి అధికంగా ఉంటుంది. ఈ సమయంలో నిర్లక్ష్యం చేసి దున్ని నాట్లు వేయడం, దుక్కిలో విత్తనాలు నాటడంతో పంటలు జీవం లేకుండా ఉండి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. యాసంగిలో వరి, మొక్కజొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటల సాగులో ఎరువులు, విత్తనాల యాజమాన్య పద్ధతులు, చీడపీడలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
వరిలో విత్తనాలు, ఎరువుల యాజమాన్య పద్ధతులు…
యాసంగి సీజన్లో వరిపంట సాగులో విత్తనాల ఎంపికకు ప్రాధాన్యతనివ్వాలి. స్వల్పకాలిక రకాలను (120 రోజుల్లో కోతకు వచ్చే రకాలు) ఎంపిక చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా 1010రకం, బతుకమ్మ(జేజే 18047)రకం, కేఎన్ఎం118రకం, ఐఆర్64 రకాలను ఎంచుకుంటే మంచిది. నత్రజని కామ్లంతో విత్తనశుద్ధి చేసుకోవాలి. నవంబర్ 15నుంచి డిసెంబర్ 15లోపు మాత్రమే నారుపోసుకోవాలి. నారుమడి ఆరోగ్యంగా పెరగాలంటే మంచు కురవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్గితెగులు లక్షణాలు ఉంటే కాసుగామైసిన్ 2.5గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వరి పంటలో ఎక్కువ ప్రభావం చూపేది భూమిలో జింకులోపం. జింకులోపంతో వరిపంటకు కైరా అనే రోగం వస్తుంది. వరి సాగు చేయబోయే భూమిలో జింకు సమపాళ్లలో ఉంటే పంట ఎదుగుదలకు, అధిక దిగుబడులు వచ్చేందుకు దోహదపడుతుంది. జింకులోపం ఉంటే దున్నిన ఆఖరి దుక్కిలో ఎకరానికి 10నుంచి 15కిలోల జింకుసల్ఫేట్‌ను విత్తుకోవాలి. ఒకవేళ పంట సాగు చేశాక జింకులోపం పంటపై కనిపిస్తే వెంటనే 100గ్రాముల చిలేటెడ్ జింకు ద్రావణాన్ని ఎకరం పంటపై పిచికారీ చేయాలి. భూసార పరీక్ష చేయించుకొని జింకు లోపాన్ని ముందస్తుగా గుర్తిస్తే వరి పంట దుక్కిలోనే జింకులోపాన్ని సరిచేసుకునే అవకాశం ఉంటుంది.
మొక్కజొన్న సాగులో ఎరువుల వాడకం
యాసంగి సీజన్లో రైతులు ఎక్కువగా మొక్కజొన్న పంట సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. మొక్కజొన్న విత్తన రకాల్లో డీహెచ్ఎం 111, 113, 115, 117, 119 ప్రధానమైనవి. విత్తనం పెట్టే ముందు దుక్కిలో ఎకరానికి 50కిలోల డీఏపీ, 25కిలోల యూరియా, 25కిలోల పొటాష్ చల్లాలి. కిలో విత్తనాన్ని 3గ్రాముల మాంకోజెబ్ లేదా థైరామ మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలి. మొక్కజొన్న పంట సాగుచేసే భూమిలో కూడా జింకులోపం ప్రభావం ఎంతో ఉంటుంది. జింకులోపం ఉన్న మొక్కజొన్న పంట ఎదుగుదల ఆగిపోయి, ఆకులు తెలుపురంగుకు మారి, గింజల నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది. జింకులోపం ఉన్న భూమిలో విత్తనాలు నాటేముందు 15నుంచి 20కిలోల జింక్ సల్ఫేట్‌ను భూమిలో చల్లి కలియదున్నాలి. పంట వేసిన తర్వాత జింకులోప లక్షణాలు కనిపిస్తే ఎకరానికి 200గ్రాముల చిలేటెడ్ జింక్‌ను పంటపై పిచికారీ చేయాలి. కలుపు నివారణ కోసం పంట వేసిన 48గంటల్లోపు అట్రజిన్ మందును, 15రోజుల అనంతరం టెంబోట్రయాన్-ఆట్రజిన్(లాడస్)ను పిచికారీ చేయాలి. మొక్కజొన్నకు ఆశించే కత్తెర పురుగు నివారణకు పంట వేసిన 1నుంచి 10రోజుల్లోపు ఎకరానికి 10నుంచి 15 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. కత్తెర పురుగుల ఉధృతిని బట్టి 15నుంచి 25రోజుల లోపు క్లోరాట్రినిలిప్రోల్ 80మి.లీ.ల మందును లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలి.
పొద్దుతిరుగుడు సాగులో ఎరువుల యాజమాన్యం..
యాసంగిలో కొందరు రైతులు పొద్దుతిరుగుడు పంట సాగు చేసేందుకు ఇష్టపడతారు. పొద్దుతిరుగుడులో కేబీహెచ్‌బీ 4478, డీఆర్సీహెచ్1 అనే విత్తన రకాలు మంచి దిగుబడులు ఇచ్చే అవకాశం ఉంది. పంటలో గింజలు ఏర్పడటానికి, ఎక్కువ గింజలు రావడానికి బోరాన్ ఎంతో ఉపయోగపడుతుంది. గింజల్లో నూనెశాతం పెంచడానికి సల్ఫర్ దోహదపడుతుంది. పంట వేసే ముందు దుక్కిని సిద్ధం చేస్తున్న సమయంలో సల్ఫర్ సింగల్ సూపర్పాస్పేటు లేదా మెగ్నీషియం సల్ఫేట్ రూపంలో దుక్కిలో పైపాటుగా వేస్తే గింజలు నాణ్యతగా ఎక్కువగా నూనెశాతంతో కాసే అవకాశం ఉంది. విత్తనాలు వేసేటప్పుడు ఎకరాకు 30కిలోల యూరియా, విత్తనం వేశాక 30రోజుల అనంతరం 20కిలోల యూరియా, 50రోజుల తర్వాత 30కిలోల యూరియా పంటకు వేయాలి. విత్తనాలు వేసిన 48గంటల్లోపు ‘పెండిమితిలిన్’ అనే మందును దుక్కిలో పిచికారీ చేయాలి. అలాగే పూత దశలో బోరాన్‌ను ఒక లీటరులో ఇక గ్రాము వేసి పంటపై పిచికారీ చేసుకుంటే పువ్వులకు ఎక్కువ గింజలు వస్తాయి.
వేరుశనగ పంట సాగులో జాగ్రత్తలు..
వేరుశనగ పంట యాసంగిలో మంచి దిగుబడులు ఇస్తుంది. ఇందులో కదిరి 6,7,8,9 రకాలు, అనంత, ఐసీజీవీ91114, టీఏజీ24, ధరణి అనే విత్తన రకాలు మేలైనవి. ఎకరానికి 75నుంచి 80కిలోలు విత్తుకోవాలి. ఎకరానికి సరిపోయే విత్తనాల్లో 200గ్రాముల రైజోబియం కల్చర్ మందును కలిపి విత్తనశుద్ధి చేస్తే మంచి దిగుబడులు వస్తాయి. విత్తనాలు వేసే ముందు 100కిలోల సూపర్పాస్పేటు, 30కిలోల పొటాష్, 18కిలోల యూరియాను కలిపి ఎకరం దుక్కిలో చల్లాలి. దిగుబడిలో జిప్సం అనేది ఎక్కువ ప్రభావం చూపుతుంది. జిప్సం ద్వారా వేరుశనగ కాయల నాణ్యతతో పాటు సైజు ఎక్కువగా పెరిగి ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. జిప్సంలో ఉంటే సల్ఫర్ అనేది గింజల్లో నూనెశాతాన్ని పెంచుతుంది. కాబట్టి వేరుశనగ పంట వేసిన తర్వాత ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200నుంచి 250కిలోల జిప్సం పంటలో విత్తుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. పంట పూర్తయ్యే వరకు కనీసం 8నుంచి 10తడుల నీటిని అందజేయాలి. తుంపరసేద్యం చేస్తే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు పొందవచ్చు.
మొక్కజొన్న సాగులో ఎరువుల వాడకం
యాసంగి సీజన్లో రైతులు ఎక్కువగా మొ క్కజొన్న పంట సాగు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. మొక్కజొన్న విత్తన రకాల్లో డీహెచ్ఎం 111, 113, 115, 117, 119 ప్రధానమైనవి. విత్తనం పెట్టే ముందు దుక్కిలో ఎకరానికి 50కిలోల డీఏపీ, 25కిలోల యూరి యా, 25కిలోల పొటాష్ చల్లాలి. కిలో విత్తనాన్ని 3గ్రాముల మాంకోజెబ్ లేదా థైరామ మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలి. మొక్కజొ న్న సాగుచేసే భూమిలో జింకులోపం ఎంతో ఉంటుంది. జింకు లోపముంటే, పంట ఎదుగుదల ఆగిపోయి, ఆకులు తెలుపురంగుకు మారి, గింజల నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది. జింకులోపం ఉన్న భూమిలో విత్తనాలు నాటేముందు 15నుంచి 20కిలోల జింక్ సల్ఫేట్‌ను భూమిలో చల్లి కలియదున్నాలి. పంట వేసిన తర్వాత జింకులోప లక్షణాలు కనిపిస్తే ఎకరానికి 200గ్రాముల చిలేటెడ్ జింక్‌ను పంటపై పిచికారీ చేయాలి. కలుపు నివారణ కోసం పంట వేసిన 48గంటల్లోపు అట్రజిన్ మందును, 15రోజుల అనంతరం టెంబోట్రయాన్-ఆట్రజిన్(లాడస్)ను పిచికారీ చేయాలి. మొక్కజొన్నకు ఆశించే కత్తెర పురుగు నివారణకు పంట వేసిన 1నుంచి 10రోజుల్లోపు ఎకరానికి 10నుంచి 15 లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి. కత్తెర పురుగుల ఉధృతిని బట్టి 15నుంచి 25రోజుల లోపు క్లోరాట్రినిలిప్రోల్ 80మి.లీ.ల మందును లీటరు నీటికి కలిపి మొక్క పూర్తిగా తడిచే విధంగా పిచికారీ చేయాలి.
ఎరువులు, విత్తనాల యాజమాన్యంతోనే మంచి దిగుబడులు
యాసంగి సీజన్లో రైతులు సాగుచేసే పంటలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చలి, వేడి పంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి విత్తనాల ఎంపిక నుంచి విత్తనశుద్ధి, దుక్కులు సిద్ధం చేసుకోవడం, విత్తనాలను క్రమ పద్ధతిలో విత్తుకోవడం, కలుపు నియంత్రణ, ఎరువుల వాడకం, నీటి యాజమాన్యం తదితర అంశాలపై రైతులు ప్రత్యేక దృష్టిసారించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పంట దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక విత్తన రకాలు కాకుండా స్వల్పకాలిక విత్తనాలను ఎంచుకొని నీటి ఎద్దడి ఏర్పడకముందే పంటలు చేతికందేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి.
-పి మహేశ్, వ్యవసాయశాఖ అసిస్టెంట్ జాయింట్ డైరెక్టర్, హుస్నాబాద్