మెదక్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ) : ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్‌లు) పదవీ కాలం ఈనెల 14వ తేదీతో ముగుస్తోంది. వారి పదవీ కాలాన్ని పొడిగిస్తారా, లేక ప్రత్యేకాధికారుల పాలన తీసుకువస్తారా అనే చర్చ జరుగుతున్నది. ఏడాది క్రితం గ్రామ పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం, ఆరునెలల క్రితం మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. కానీ, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో సహకార సంఘాల ఎన్నికలు కూడా ఇప్పట్లో నిర్వహించక పోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. జనవరి 30తో మున్సిపాలిటీల పదవీకాలం ముగిసింది. దీంతో మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, సిద్దిపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, సంగారెడ్డి జిల్లాలోని 8 మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పడిన బల్దియాలకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది.
మెదక్ జిల్లాలో 37 పీఏసీఎస్‌లు
మెదక్ జిల్లాలో ప్రస్తుతం 37 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్‌లు) ఉన్నాయి. మెదక్ మండలం మెదక్, మాచవరం, హవేళీఘనపూర్ మండలం నాగాపూర్, ఫరీద్పూర్, పాపన్నపేట మండలంలో పాపన్నపేట, కొత్తపల్లి, చీకోడ్, రామాయంపేట మండలంలో రామాయంపేట, కోనాపూర్, నిజాంపేట మండలంలో కల్వకుంట్ల, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలంలో చిన్నశంకరంపేట, జంగరాయి, మడూరు, చందంపేట్, కొల్చారం మండలంలో కొల్చా రం, రంగంపేట్, వరిగుంతం, రాంపూర్, కిష్టాపూర్, అంసాన్పల్లి, కొంగోడ్, కౌడిపల్లి మండలంలో మహ్మద్‌నగర్, చేగుంట మండలంలో రెడ్డిపల్లి, ఇబ్రహీంపూర్, నార్సింగి మండలంలో నార్సింగి, తూప్రాన్ మండలంలో తూప్రాన్, వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి, శివ్వంపేట మండలంలో శివ్వంపేట, నర్సాపూర్ మండలంలో నర్సాపూర్, రేగోడ్ మండలంలో రేగోడ్, అల్లాదుర్గం మండలంలో అల్లాదుర్గం, టేక్మాల్ మండలంలో టేక్మాల్, చిలిపిచెడ్ మండలంలో సోమక్కపేట, పెద్దశంకరంపేట మండలంలో పెద్దశంకరంపేటలో సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘా ల్లో సుమారుగా 76 వేల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘాల ద్వారా రైతులకు పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు, బంగారం తాకట్టు, వాహన, ఇతర రుణాలు అందజేసున్నారు. కొన్ని సొసైటీలు ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల విక్రయాలు చేపడుతున్నాయి. పెట్రోల్ బంకులు నిర్వహణ, యంత్రాలు కిరాయికి ఇవ్వడం వంటి వ్యాపారాలు చేస్తున్నాయి.
29 కొత్త సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
మండలానికి రెండు సహకార సంఘాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు మెదక్ జిల్లాలో కొత్తగా 29 సంఘాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత ఆయా సంఘాల పరిధిలోని రైతులను కొత్త సంఘాల్లో చేర్చి సభ్యత్వాలు ఇస్తారు. ఓటర్ల జాబితాలు, డైరెక్టర్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించాల్సి ఉంటుంది. ఈ తంతు పూర్తి కావడానికి నాలుగైదు నెలలైనా పడుతుంది.
గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే గానీ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో రైతులకు విస్తృత సేవలు అందించే సహకార సంఘాల పాలక వర్గాల పదవీ కాలం పొడిగిస్తారా, ప్రత్యేకాధికారులను నియమిస్తారా అనే విషయమై ప్రభు త్వం నుంచి స్పష్టత రాలేదు. ఓటర్ల జాబితాల రూపకల్పన ఇప్పటి వరకు మొదలు కాలేదు. దీంతో మరో ఆరు నెలలకు గానీ ఎన్నికలు జరిగే పరిస్థితి కనబడడం లేదు. జిల్లాలో కొత్తగా మరో 29 సంఘాల ఏర్పాటుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించగా, వాటిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది..
ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. పీఏసీఎస్‌ల పాలకవర్గాల పదవీ కాలం ఈ నెల 14వ తేదీతో ముగియనున్నది. పాలకవర్గాల పదవీ కాలాన్ని పొడిగిస్తారా, ప్రత్యేక అధికారులను నియమిస్తారా అనే విషయమై ఏమి తెలియదు. మెదక్ జిల్లాలో ఇప్పుడున్న 37 సంఘాలకు తోడు మరో 27 కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
-కరుణాకర్, సహకార శాఖ జిల్లా ఇన్చార్జి అధికారి మెదక్