పటాన్చెరు, మార్చి 30: పంచాయతీల్లో పన్నుల వసూళ్ల వేగవంతమయ్యాయి. మార్చి చివరి తేదీలోగా వందశాతం పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో పంచాయతీ సిబ్బంది ముందుకెళ్తున్నారు. పంచాయతీల అభివృద్ధిలో పన్నుల వసూళ్లు కీలకం కావడంతో జిల్లా పంచాయతీ అధికారి వందశాతం పన్నుల వసూళ్లు సాధించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు 91.78శాతం పన్నులు వసూలు అయ్యాయి. పటాన్చెరు మండలంలో రూ.12 కోట్ల 49 లక్షల 64వేల 644ల డిమాండ్ ఉండగా వాటిలో రూ. 11కోట్ల 46లక్షల 87వేల 676 వసూలు చేశారు.
రుద్రారం పంచాయతీలో రూ. 2కోట్ల27లక్షలకు రూ. 2కోట్ల 17లక్షలు, పాశమైలారంలో రూ. 1కోటి 98లక్షలకు రూ. కోటి 93లక్షలు, ఇస్నాపూర్‌లో రూ. 2కోట్ల 10లక్షలకు రూ.కోటి 82లక్షలు, ముత్తంగిలో రూ. 88లక్షల 84వేలకు రూ. 78లక్షల 43వేలు, చిట్కుల్లో కోటి 62లక్షలకు రూ. కోటి 53లక్షలు, పాటిలో రూ. 98లక్షల 25వేలకు రూ.87లక్షల 46వేలు, ఇంద్రేశంలో 34లక్షల 55వేలకు రూ. 32లక్షల 89వేలు, భానూర్‌లో రూ. 63లక్షల 68వేలకు 56లక్షల 43వేలు వసూలయ్యాయి. క్యాసారంలో మాత్రం రూ.3లక్షల 64వేలకు రూ.73వేల 180 మాత్రమే వసూలయ్యాయి. కేవలం 20శాతం మాత్రమే క్యాసారంలో పన్నులు వసూలు కావడం విశేషం. వందశాతం పన్ను వసూలు చేసి బచ్చుగూడెం, ఘనపూర్, ఐనోల్, కర్ధనూర్, లక్డారం, పెద్దకంజర్ల అన్ని పంచాయతీలకు ఆదర్శంగా నిలిచాయి.
పటాన్చెరు మండలంలో 19 గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్లకు ప్రధాన అవరోధంగా మొండి బకాయిలు నిలుస్తున్నాయి. మూత పడిన పరిశ్రమలు, భవనాలు నిర్మించి వదిలిపెట్టిన యాజమాన్యాలు, ఆచూకీ లేని సంస్థల ఆస్తులపై పన్నులు వసూలు చేయడం కష్టతరంగా మారింది. పలు విద్యాసంస్థలు సైతం పన్నులు చెల్లించడంలో నిర్లక్ష్యం చూపుతున్నాయి. పన్ను వసూళ్లు జరిగితేనే మండలం నెంబర్‌వన్‌గా నిలుస్తుంది.
సంగారెడ్డి జిల్లాలోనే పటాన్చెరు మండలంలోని పంచాయతీల్లోనే అధిక పన్నులు వసూలు అవుతాయి. అయితే కొన్ని పంచాయతీలలో బహుళ అంతస్తుల నిర్మాణం జరగడంతో రికార్డుల్లో లేని అంతస్తులపై పన్నులను చూపడంలో పంచాయతీలు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అన్ని అంతస్తులకు పన్నులు వేస్తే మరిన్ని కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వస్తాయి. పలు పరిశ్రమలు సైతం తమ నిర్మాణాలకు అనుగుణంగా పన్నులను చెల్లించడం లేదు.
వందశాతం ఇంటి పన్నుల వసూళ్లకు దగ్గరయ్యాం. మొండి బకాయిలు ఉన్నాయి. వాటి కోసం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాం. కొన్ని పంచాయతీలు పన్నుల వసూళ్లలో వెనుకబడ్డాయి. గ్రామ కార్యదర్శులు బాధ్యతగా పనిచేసేలా ఆదేశాలు ఇచ్చాం. పంచాయతీల అభివృద్ధికి పన్నుల వసూళ్లే కీలకం. పన్నుల వసూళ్లలో సమస్యలుంటే తక్షణం పరిశీలించి చర్యలు తీసుకుంటున్నాం.
– హరిశంకర్ గౌడ్, ఎంపీవో, పటాన్చెరు