వాణిజ్య పంటల సాగులో సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం ప్రఖ్యాతిగాంచింది. ఆయా పంటలను సాగు చేస్తున్న అన్నదాతలు ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. జిల్లాలోనే అత్యధికంగా కోహీర్ మండలంలోని పలు గ్రామాల్లో చెరుకు తోటలను సాగు చేస్తున్నారు. మనియార్పల్లి, బిలాల్పూర్, కోహీర్, దిగ్వాల్, మద్రితోపాటు తదితర గ్రామాల్లో రైతులు చెరుకు పంట పండిస్తున్నారు. మండలంలో 2,200ఎకరాలకు పైగా చెరుకు సాగవుతున్నది.
ఒక్కసారి విత్తనం వేస్తే చాలు…
పొలంలో ఒక్కసారి చెరుకు విత్తనం నాటితే చాలు మూడు సంవత్సరాల పాటు అదే పంట ఉంటుంది. మరోసారి విత్తనం నాటాల్సిన అవసరం ఉండదు. ఎరువులు, సాగునీటిని సకాలంలో అందిస్తే సరిపోతుంది. ఎకరా సాగు చేసేందుకు రూ.30 వేల వరకు ఖర్చు అవుతుంది. చేను దున్నకం, ఎరువులు, విత్తనం, కూలీల కోసం వెచ్చించాల్సి ఉంటున్నది. పొలంలో చెరుకు విత్తనం నాటిన నుంచి తొమ్మిది నెలల తర్వాత పంట కోతకు వస్తుంది. తొమ్మిది నెలల నుంచి సంవత్సరం గడిచే వరకు ఎప్పుడైనా చెరుకు కోతలను ప్రారంభించే అవకాశం ఉంటుంది. చేనులో ఏపుగా పెరిగిన గడలను సేకరిస్తారు. పొలంలో నాటిన తర్వాత ఎరువులు, సాగు నీటిని సకాలంలో అందించాలి. అప్పుడే చెరుకు తోట ఏపుగా పెరుగుతుంది. ఎకరానికి 30వేల పెట్టుబడితో లక్ష రూపాయలకుపైగా ఆదాయం వస్తున్నది. ఎకరానికి 40నుంచి 50టన్నుల చెరుకు ఉత్పత్తి అవుతున్నది.
పలు ప్రాంతాలకు చెరుకు రవాణా..
కోహీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో సాగు చేస్తున్న చెరుకు పంట ద్వారా రైతన్నలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. తమ పొలంలోని చెరుకును కత్తిరించి జహీరాబాద్, మహబూబ్నగర్, కర్ణాటక, తదితర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లు, లారీల ద్వారా పలు పరిశ్రమలకు తరలిస్తున్నారు. రైతులకు దిగుబడితో పాటు గిట్టుబాటు అవుతున్నది. పలు పరిశ్రమల యాజమాన్యాలు టన్ను చెరుకు ధర మూడు వేల రూపాయల వరకు చెల్లిస్తున్నాయి. దీంతో చెరుకును పండించే రైతులు లాభాల బాట పడుతున్నారు. చెరుకు తోటల పెంపకంతో నష్టం అనే సమస్యే ఉండదని చెబుతున్నారు.
కర్ణాటకకు పంపిస్తున్నా..
మూడు ఎకరాల్లో చెరుకు పంటను వేశాను. ప్రస్తుతం చెరుకును కోసి కర్ణాటకకు పంపిస్తున్నాను. ఎకరానికి 30వేల రూపాయల వరకు ఖర్చు అయ్యింది. పంట కూడా బాగానే ఉంది. ఎకరానికి 40టన్నుల కంటే ఎక్కువగా వచ్చే అవకాశమున్నది. కచ్చితంగా లాభం వస్తుంది.
పరిశ్రమను ఏర్పాటు చేయాలి..
రైతులకు ఇబ్బందులు రాకుండా స్థానికంగా చక్కెర పరిశ్రమను ఏర్పాటు చేయాలి. కంపెనీల ఏర్పాటులతో రైతులకు మంచి జరుగుతుంది. చెరుకు నుంచి చక్కెర తయారు చేయడంతో పాటు మొలాసిస్ ద్వారా ఇథనాల్, ఆల్కాహాల్ తయారు చేయవచ్చు. చాలా మందికి ఉపాధి కూడా దొరుకుతుంది. ప్రభుత్వం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి.