పటాన్చెరు, ఏప్రిల్ 9 : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఊసులేకుండా ప్రధాని రాష్ట్రంలో పర్యటించారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ముత్తంగి, ఇస్నాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్న విగ్రహాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ నెల 14న విగ్రహావిష్కరణకు తుది పనులను పరిశీలించి సలహాలిచ్చారు. అనంతరం ముత్తంగి గ్రామంలోని ప్రైవేటు ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ఎలాంటి ప్రణాళిక లేకుండానే తెలంగాణకు వచ్చారని పేర్కొన్నారు. తెలంగాణకు ఇప్పటి వరకు మోదీ చేసిందేమి లేదన్నారు. సికింద్రాబాద్ మీటింగ్‌లో మోదీ సీఎం కేసీఆర్‌ది కుటుంబ పాలన అని ఆరోపించడాన్ని ఖండించారు. తెలంగాణ ఉద్యమ పోరాటంలో కేసీఆర్‌తో పాటు హరీశ్‌రావు, కేటీఆర్‌లు చేసిన త్యాగాలు గుర్తు చేశారు. అమెరికాలో ఉద్యోగాన్ని సైతం కాదనుకొని కేటీఆర్ తెలంగాణ పోరాటంలో ముందున్నారన్నారు. కుటుంబ పాలన చేస్తున్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలో కొనసాగుతున్నది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. మీకు అనుకూలంగా ఉంటే ఒకరకంగా, లేకుంటే మరోరకంగా ఉంటారని అన్నారు.
దేశంలో బొగ్గు గనులను, మైన్స్‌లను పారిశ్రామికవేత్తలకు దారదత్తం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. దేశ సహజ సంపదను పారిశ్రామికవేత్తల చేతిలో పెడుతున్నారన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. పంచాయతీల్లో మహాత్మాగాంధీ, ముఖ్య కూడళ్లలో అంబేద్కర్ విగ్రహాలను పెడతామన్నారు. యువతకు స్ఫూర్తినిచ్చే శివాజీ విగ్రహాలను కూడా ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. ఈ నెల 12న తెల్లాపూర్ మున్సిపాలిటీ వెలిమెల తండాలో, 13న కొల్లూర్ గ్రామంలో, 14న పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాలను ప్రతిష్ఠిస్తామన్నారు. 16న బీరంగూడ చౌరస్తాలో మహాత్మా బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ ఉంటుందన్నారు. ఇస్నాపూర్ చౌరస్తాలో చిట్కుల్ వెళ్లే దారిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
రూ. 6 కోట్లతో డివిజన్ వార్డు కార్యాలయం
పటాన్చెరు పట్టణంలో జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం ఏర్పాటు కోసం ఐదు వందల గజాల స్థలంలో భారీ నిర్మాణం చేస్తామన్నారు. దాదాపు రూ. 6 కోట్ల సీఎస్సార్ నిధుల ఖర్చుతో మొదటి అంతస్తులో వార్డు కార్యాలయం, మిగిలిన అంతస్తుల్లో ప్రెస్‌క్లబ్, వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రజల కోసం వారి భాషల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. మినీ ఇండియాలో దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు అన్ని భాషల గ్రంథాలయాలు ఉపయోగపడుతాయన్నారు. త్వరలో శంకుస్థాపన చేసి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ప్రెస్ క్లబ్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. దాదాపు 50 మంది ఒకేమారు న్యూస్ పంపుకొనేలా కంప్యూటర్స్, ఇంటర్నెట్ సౌక ర్యం, సమావేశ మందిరం ఏర్పాటు చేసి ఇస్తామన్నారు. వాటితో పాటు ఈ నెల చివరన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందజేస్తామన్నారు. తహసీల్దార్ల చేతుల మీదుగా పట్టాలను అందిస్తామని హామీనిచ్చారు. త్వరలోనే సూపర్ స్పెషాలిటీ దవాఖానను రూ. 300 కోట్లతో నిర్మించేందుకు శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు.
సమావేశంలో పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశై లం యాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పాండు, నాయకులు దశరథరెడ్డి, మాజీ మం డల ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌గుప్తా, సర్పంచ్‌లు ఉపేందర్ ముదిరాజ్, ఎం.కృష్ణ, మాజీ సర్పంచ్ బీ. వెంకట్‌రెడ్డి, మైనార్టీ మండలాధ్యక్షుడు అబేద్, మెరాజ్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, భిక్షపతి, చంద్రశేఖర్‌రెడ్డి, కిట్టు, గడ్డ యాద య్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.