తెలంగాణలోని ఆలయాలకు మహర్దశ వచ్చింది. ఎంతో చరిత్ర కలిగి నిత్య పూజలందుకున్న ఆలయాలను గత పాలకులు పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆలయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆలయాల్లో నిరంతరం పూజలు, ఇతర కార్యక్రమాలు జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకాన్ని అమలు చేస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 3200 ఆలయాలు ఉన్నాయి. మొదట విడతగా 140, రెండో విడతలో 276 ఆలయాలను గుర్తించి ధూప దీప నైవేద్యం పథకాన్ని వర్తింపజేశారు. ఇప్పుడు మరిన్ని ఆలయాలను ఇందులో చేర్చడానికి దేవాదాయశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గతంలో శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకంతో నిత్యపూజలు జరుగుతుండడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నది.
అందోల్, మే 29: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ సర్కార్ కొలువుదీరిన తర్వాత దేవాలయాలకు మహర్దశ వచ్చింది. ఎంతో చరిత్ర కలిగి నిత్య పూజలందుకున్న ఆలయాలను సైతం గత పాలకులు పట్టించుకోక పోవడంతో ఆదరణ కరువయ్యాయి. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అలాంటి ఆలయాల రూపురేఖలు మారిపోయాయి. ప్రతి ఆలయంలో దేవతామూర్తులకు నిత్య పూజలు జరుగుతున్నాయి. తద్వారా భక్తులు, పూజారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో నిరంతరం పూజలు, ఇతర కార్యక్రమాలు ఘనంగా జరగాలనే ఉద్దేశంతో ధూపదీప నైవేద్య పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఈ పథకానికి భారీగా నిధులు పెంచింది. గతంతో శిథిలావస్థకు చేరుకున్న ఆలయాల్లో ధూపదీప నైవేద్య పథకంతో నిత్యపూజలు జరుగుతుండడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో…
ఉమ్మడి మెదక్ జిల్లాలో 3200 ఆలయాలు ఉన్నాయి. మొదట విడతగా 140, రెండో విడతలో 276 ఆలయాలను గుర్తించి ధూప దీప నైవేద్యం పథకాన్ని వర్తింపజేశారు. ఇప్పుడు మరిన్ని ఆలయాలను ఇందులో చేర్చడానికి దేవాదాయశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొదటగా ఏప్రిల్ 27 వరకు దరఖాస్తులు అందించేందుకు గడువు విధించగా, ఆ తర్వాత దానిని మే 20 వరకు పొడింగించారు. కానీ, ఈ పథకం ద్వారా మరిన్ని ఆలయాలకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో గడువును జూన్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మే 20 గడువు ముగిసే నాటికి 550 వరకు దరఖాస్తులు వచ్చాయని, గడువు పొడిగించడంతో దరఖాస్తులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని దేవాదాయశాఖ అధికారులు చెబుతున్నారు.
ధూప దీప నైవేద్యాలతో అర్చకులకు ఆర్థిక భరోసా

గతంలో భక్తులు ఇచ్చే కానుకలతో ఆలయాల్లో నిత్యపూజలు, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించేవారు. దీంతో పూజారులకు ఆలయాల నిర్వహణ, కుటుంబ పోషణ కష్టంగా మారింది. ధూపదీప నైవేద్య పథకం ప్రారంభమై అర్చకులకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో ఆలయాల్లో పూజలు కొనసాగుతున్నాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖ 2009లో ధూప, దీప నైవేద్యం పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత అర్చకులకు నెలకు రూ. 2500 వేతనంగా నిర్ణయించింది. కానీ, ఈ వేతనాలు అర్చకులకు, ఆలయాల నిర్వహణకు ఏమాత్రం సరిపోవని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 2015 జూన్ 2 నుంచి ధూపదీప నైవేద్యాల కింద అందజేస్తున్న వేతనాలు రూ. 6వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అటు ఆలయాలకు.. ఇటు అర్చకులకు ఎంతో మేలు చేకూరింది.
రూ. 6వేలలో రూ. 4వేలు అర్చకుడి వేతనం, రూ. 2వేలు ఆలయంలో పూజలు, ఇతర నిర్వహణకు వినియోగించేలా నిర్ణయించడంతో ఆలయాలు నిత్య పూజలతో వెలుగొందుతున్నాయి. ప్రతినెలా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అర్చకులకు సైతం వేతనాలు అందుతున్నాయి. ధూపదీప నైవేద్య పథకం శిథిలావస్థలో ఉన్న ఆలయాలకు జీవం పోయడంతో పాటు అర్చకులకు జీవనోపాధి కల్పించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో దరఖాస్తులను స్వీకరించి జిల్లా యూనిట్‌గా మూడు జిల్లాలకు సమానంగా ధూప దీప నైవేద్యాల్లో చోటు కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఎలాంటి పైరవీలకు తావులేదని, వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తామని, ఆ కమిటీ పారదర్శకంగా ఎంపిక చేస్తుందని దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగి గతంలో ఓ వెలుగు వెలిగి, ఆదరణ లేక శిథిలమవుతున్న ఆలయాలను ధూప దీప నైవేద్యం పథకంతో పూర్వవైభవం తెస్తున్న సీఎం కేసీఆర్‌కు అర్చకులు, భక్తులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పారదర్శకంగా ఆలయాల ఎంపిక..
ధూప దీప నైవేద్యాల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఇప్పటి వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు గడువును రెండుసార్లు పొడిగించాం. ఈనెల 20 వరకు దరఖాస్తులకు చివరి తేదీగా ఉండడంతో 500 దరఖాస్తులు వచ్చాయి. గడువును జూన్ 5వరకు పొడిగించడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా ఆలయాల ఎంపికను చేపట్టేందుకు ఓ కమిటీ పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి పైరవీలకు తావులేదు. ఎవరు కూడా పైరవీకారులను
నమ్మవద్దు.
– నాగరాజు, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, సంగారెడ్డి
ఆలయాలకు పూర్వవైభవం..
ధూపదీప నైవేద్యాలతో ఆలయాలకు పూర్వవైభవం వస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో శిథిలావస్థకు చేరిన ఆలయాల్లో సైతం నిత్యపూజలు జరుగుతన్నాయి. ఇప్పుడూ ఈ పథకం ద్వారా మరిన్ని ఆలయాలకు లబ్ధి చేకూరనున్నది. గ్రామాల్లో ఎన్నో వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాలు సరైన ఆదరణ లేక పూజలకు నోచుకోవడం లేదు. ధూప దీప నైవేద్యం పథకంలో ఇలాంటి ఆలయాలకు ప్రాధాన్యత నివ్వాలి.
– శీలంకోట ప్రవీణ్‌శర్మ, అర్చకుడు