సిద్దిపేట, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోట అని, రానున్న ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుతో కలిసి కేటీఆర్ హాజరై పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దన్నారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలువాలని పిలుపునిచ్చారు. మెదక్ ఎంపీ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, గత శాసనసభ ఎన్నికల్లో ఏడింటికి ఆరు చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారన్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని శాసనసభ స్థానాల్లో కలిపి 2,80,000 ఓట్ల మెజార్టీ సాధించి ఆధిక్యంలో ఉన్నామని చెప్పారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మోసపూరిత వాగ్ధ్దానాలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, కాంగ్రెస్ మోసపూరిత విధానాలను ఎండగట్టాలని క్యాడర్‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు. గడిచిన పదేండ్లలో పార్లమెంట్లో తెలంగాణ తరఫున గళం విప్పింది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే అన్నారు. విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, మనం లేకపోతే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని కేటీఆర్ చెప్పారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు కసితో పనిచేయాలని, సింహాలై గర్జించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఈ సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. కార్యకర్తలు కష్టపడి పని చేసి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడింటికి ఆరు అసెంబ్లీ సీట్లు గెలిపించారన్నారు. మెదక్ అసెంబ్లీ సీటును తకువ ఓట్లతో కోల్పోయామని తెలిపారు. మెదక్ పరిధిలో ఎకువ సీట్లు గెలిపించి కేసీఆర్ పేరును కార్యకర్తలు నిలబెట్టారని, అందరికీ శిరస్సు వంచి నమసరిస్తున్నానని, ఈ ఓటమి తాతాలికమే ..శాశ్వతం కాదన్నారు. గెలిచినప్పుడు పొంగి పోలేదని ..ఇప్పుడు కుంగిపోయేది లేదన్నారు. కేసీఆర్ ఎన్నో ఆటుపోట్లు ఎదురొన్నారని గుర్తుచేశారు. ఎన్నో అవమానాలు భరించి తెలంగాణ సాధించారన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు విలువైన సూచనలు చేశారని, వాటిని కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. కేసీఆర్ పథకాల అమలుకు పోటీపడితే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు అక్రమ కేసుల బనాయింపుల్లో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులను వాడుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను భయబ్రాంతులను గురిచేస్తున్నారని, పోలీస్స్టేషన్లు, జైళ్లు, పోరాటాలు మనకు కొత్త కాదని హరీశ్‌రావు అన్నారు. ఒక్క కార్యకర్తకు ఏం జరిగినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అండగా ఉంటారని, భరోసా ఇచ్చారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అనే దుష్ప్రచారాన్ని కార్యకర్తలు గట్టిగా తిప్పికొట్టాలన్నారు.మెదక్ పార్లమెంట్ సీటును బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవాలని పిలుపునిచ్చారు. ఎవరూ అధైర్య పడవద్దని, భవిష్యత్‌లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిజమైన మార్పు వస్తుందని, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడదామని పార్టీ క్యాడర్‌కు హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
తెలంగాణ భవన్లో జరిగిన మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశం బీఆర్ఎస్ క్యాడర్లో జోష్‌ను నింపింది. కేటీఆర్, తన్నీరు హరీశ్‌రావు దిశానిర్దేశం చేయడంతో క్యాడర్ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడారు. సమావేశంలో ఆయా శాసనసభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కొన్నిచోట్ల ఓడిపోవడానికి గల కారణాలను విశ్లేషించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దు అని కేటీఆర్, హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శేరి సుభాష్‌రెడ్డి, వంటేరు యాదవరెడ్డి, వెంకట్రామ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, జడ్పీచైర్పర్సన్లు వేలేటి రోజాశర్మ, మంజుశ్రీ, హేమలత, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, వంటేరు ప్రతాప్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.