మెదక్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ): ఆరుగాలం కష్ట్టపడి సాగు చేసిన పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టపోతున్నారు. యాసంగిలో రైతులు రూ. వేలు ఖర్చు చేసి పంటలు సాగుచేశారు. ఎరువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, కూలీల ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలు తప్పడం లేదు. అకాల వర్షాలు అన్నదాతను వెంటాడుతున్నాయి. ప్రతి సంవత్సరం అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. మెదక్ జిల్లాలో రైతులు ఎక్కువగా వరి పంట సాగు చేస్తారు. యాసంగిలో వరి సాగు చేసినా కరెంట్ సమస్య వల్ల ఘనపూర్ ఆయకట్టలో సాగునీరు లేక రైతులు సాగు చేస్తున్న పంటలు ఎండిపోయాయి. వరి నాట్లు వేసేందుకు రైతులు బీహారుతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి కూలీలను తీసుకువచ్చారు. పెట్టుబడి ఖర్చులు పెరిగినా కేంద్రం మద్దతు ధర పెంచలేదు. వరి కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. దీంతో రైతులు వరి ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. మెదక్ జిల్లాలో 2.36 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 518 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, యాసంగిలో 4,45,466 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
మెదక్ జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని జిల్లా అధికారులు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నెల 10న కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని జిల్లా అధికారులు వెల్లడించారు. మెదక్ జిల్లాలో ఐకేపీ ద్వారా 154 కొనుగోలు కేంద్రాలు, ఏపీసీఎస్ ద్వారా 224, డీసీఎంఎస్ ద్వారా 9, ఎఫ్‌పీవోల ద్వారా 26 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా 518 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరికోతలు ప్రారంభమైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏగ్రేడ్‌కు రూ. 2389, సాధారణ రకానికి రూ. 2369 మద్దతు ధర నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో క్వింటాల్‌కు రూ. 2500, సన్న రకం క్వింటాల్‌కు రూ.. 2800 ధర పలుకుతుంది. బహిరంగ మార్కెట్లో ధర అధికంగా ఉండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

మెదక్ జిల్లా వ్యాప్తంగా 518 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఏప్రిల్ 10 నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సివిల్ సప్లయ్ అధికారులు, రవాణా, వ్యవసాయ, రైస్ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశాం. గన్నీబ్యాగులు, టార్పాలిన్ల్లు, సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాం. రైస్ మిల్లు యజమానులు రవాణా వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పాం. రైస్ మిల్లర్లు ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియా త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదేశాలు ఇచ్చాం. తూనికలు, కొలతల అధికారులు ధాన్యం తూకం వేసే సమయంతో తనిఖీలు చేయాలని చెప్పాం.
– నగేశ్, అదనపు కలెక్టర్ మెదక్ జిల్లా