సిద్దిపేట, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది.అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఓటరు జాబితాల సవరణ తదితర వాటిపై దృష్టి సారించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహీతంగా జరుగుతాయి. ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఎన్నికల కమిషన్ ప్రకటించే గుర్తులతో బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి నిర్వహిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు,14, 336 వార్డులు ఉన్నాయి.
సిద్దిపేట జిల్లాలో 499 జీపీ లు, 4,476 వార్డులు, మెదక్ జిల్లాలో 469 జీపీలు, 4,082 వార్డులు, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు, 5,778 వార్డులు ఉన్నాయి. జనవరి 2019లో పంచాయతీ ఎన్నికలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. 1 ఫిబ్రవరి 2024తో పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. దీంతో ఆరోజు నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓటర్ల జాబితా తయారీపై జిల్లాలో ఎంపిక చేసిన ఆపరేటర్లకు ఈనెల 2,3తేదీల్లో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో శిక్షణ ఇచ్చారు.
శిక్షణ పొందిన ఆపరేటర్ల ద్వారా పంచాయతీ ఎన్నికలకు అవసరమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లను ఆదేశించింది. దీంతో జిల్లా స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామాల్లో మాజీ ప్రజాప్రతినిధులతో పాటు ఈసారి యువత ఎన్నికల్లో పోటీ చేయటానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్న వారంతా అప్పుడే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పోటీ చేస్తే ఎలా ఉంటుంది..? గెలుస్తామా..? లేదా..? రిజర్వేషన్ ఎలా ఉంటుంది..? తదితర అంశాలపై మద్దతుదారులతో మంతనాలు చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు గతంలోనే ఏర్పాట్లు పూర్తి చేశారు. గత ఏడాది డిసెంబర్లోనే సర్పంచ్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్,పోలింగ్ అధికారులను నియమించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియను నిలిపివేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడంతో మళ్లీ జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అక్కడ కల్పించాల్సిన సౌకర్యాలు తదితర వాటిపై అధ్యయనం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు పోలింగ్ అధికారి ఉంటారు. 201 నుంచి 400 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 650 మంది ఓటర్ల వరకు ప్రిసైడింగ్ అధికారి ముగ్గురు పోలింగ్ అధికారులు ఉంటారు.
650 మంది ఓటర్ల కంటే ఎక్కువ ఉంటే అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఎన్నికల నిర్వహణ పూర్తి కాగానే అదే రోజు ఎన్నికల ఫలితాలు ప్రకటించాల్సి ఉంటుంది అందుకు తగ్గ ఏర్పాట్లు తదితర వాటిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేలా అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. ఓటర్ల జాబితా సవరణపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లోని ఓటరు జాబితాను గ్రామాల్లో వార్డుల వారీగా విభజిస్తున్నారు. ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ నెల మొదటి వారంలోగా ఓటరు జాబితా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్స్‌లు వినియోగిస్తారు.
ఎన్ని బ్యాలెట్ బాక్స్‌లు అవసరం అనే దానిపై దృష్టి సారించారు. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనలో అన్నీ కష్టాలే వచ్చి పడ్డాయి. గ్రామ పంచాయతీలకు పాలక వర్గాలు లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావు. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత వరకు ఒక్క పైసా కూడా నిధులను విడుదల చేయలేదు. దీంతో గ్రామ పంచాయతీలు నిధులు లేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభు త్వం మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఓటరు జాబితా సవరణ పూర్తైన వెంటనే నిర్ణీత గడువులోగా బీసీ రిజర్వేషన్లు పంపించాలని బీసీ కమిషన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది. ఇప్పుడు ఉన్న పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా..? లేదా ? అనే దానిపై నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. గత పంచాయతీ ఎన్నికల సమయంలో నూతనంగా పంచాయతీ రాజ్‌చట్టం తీసుకువచ్చింది. దీని ప్రకారం రెండు సార్లు ఒకే రిజర్వేషన్ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఇదే రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలా..? కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలా..? అని రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక పోతున్నది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ స్థానిక సంస్థల్లో 42 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. వీటితో పాటు ఉపకులాల వారీగా రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కాంగ్రెస్ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందా ..? లేదా ..? వేచి చూడాల్సిందే. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా స్థానిక సంస్థల పరిధిలో కులాల గ్రూపుల వెనుకబాటుపై బీసీ కమిషన్ ద్వారా విచారణ జరిపి.. ఆయా చోట్ల ఏనిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనేది తేల్చాలని సూచనలు చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా అన్ని కలిపి కూడా 50 శాతం రిజర్వేషన్లు మించకుండా ఉండాలని స్పష్టం చేసింది.