పటాన్చెరు రూరల్, ఏప్రిల్ 28: అప్రకటిత విద్యుత్ కోతలు పరిశ్రమల వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరమ్మతులు, ఇతరత్రా కారణాలు చెబుతూ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా తరుచూ నిలిచిపోతుండడంతో ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నది. దీంతో మళ్లీ జనరేటర్లను ఆశ్రయిస్తున్నారు పరిశ్రమల యాజమన్యాలు. ఏ పరిశ్రమ చూసినా ఇప్పుడు జనరేటర్లు కొనే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే కొన్ని పరిశ్రమల్లో కొత్త జనరేటర్లు బిగింపబడ్డాయి. పదేండ్లుగా జనరేటర్ల అవసరం పడని చిన్న పరిశ్రమలు తమ పరిశ్రమలో స్థలం లేక ఆరుబయట రోడ్ల పక్కన పెట్టుకుంటున్నాయి.
మండు వేసవిలో డిమాండ్‌కు తగ్గట్టుగా కరెంటు సరఫరా కావడం లేదు. డిమాండ్‌కు, సరఫరాకు ప్రభుత్వం సరైన కసరత్తు చేయకపోవడంతో పరిశ్రమల పాలిట శాపంగా మారుతున్నది. ఇప్పటికే ఇస్నాపూర్ సబ్‌స్టే
షన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడ అప్రకటిత విద్యుత్ కోతలను చవిచూస్తున్నది. దీనివల్ల పరిశ్రమలపై ఆర్థిక భారం పడుతున్నది. నిరంతర విద్యుత్ ఉంటేనే బాయిలర్లు నడుస్తాయి. కరెంట్ కోతలతో బాయిలర్లలో వేడి తగ్గిపోయి ప్రోడక్ట్ దెబ్బతింటుంది. అప్రకటిత విద్యుత్‌కోతలతో ఒప్పుకున్న ఆర్డర్లు సకాలంలో పరిశ్రమలు పూర్తిచేయలేక పోతున్నాయి. విద్యుత్ సరఫరా సరిగ్గా లేక చాలా పరిశ్రమలు తమ ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు తెలిసింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలో 46,623 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 358 పరిశ్రమల కనెక్షన్లు, 39,863 డొమెస్టిక్ కనెక్షన్లు, కమర్షియల్ కనెక్షన్లు 4,906, అగ్రికల్చర్ కనెక్షన్లు 925,హెటీ సర్వీసు 250 కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో అత్యంత ప్రధానమైనవి పరిశ్రమల కనెక్షన్లు. 358 పరిశ్రమల్లో నిరంతరం ఉత్పత్తులు తీస్తున్నారు. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు ఉన్నాయి. దాదాపు 150 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఇక్కడ ఉంది. పాశమైలారంలో 3 సబ్స్టేషన్లు, వివిధ గ్రామాల్లో మరో మూడు సబ్స్టేషన్లు ఏర్పాటు చేశా రు. దాదాపు 70వేల మంది కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాశమైలారం, ఇస్నాపూర్, రుద్రారం, ముత్తంగి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. మూడు
షిప్టులు పరిశ్రమలు నడుస్తుండడంతో ఎవరి ఉపాధికి ఢోకా లేదు.
బీఆర్ఎస్ హయాంలో తొమ్మిదేండ్లు పరిశ్రమలకు నాణ్యమైన కరెంటు అప్పటి ప్రభుత్వం సరఫరా చేసింది. నిరంతరం నాణ్యమైన, కోతలు లేని విద్యుత్‌ను సరఫరా చేయడంతో పరిశ్రమలు స్వర్ణయుగాన్ని చూశా యి. దేశంలోనే అత్యధిక జీడీపీని ఇస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిచేలా పరిశ్రమలు తోడ్పాటును అందించాయి. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కాంతులతో తెలంగాణ జిగేల్మంటూ అన్నిరంగాల్లో దూసుకుపోయింది. ఇప్పు డు ఆ పరిస్థితికి కాలం చెల్లేలా ఉంది. పరిశ్రమల్లో మళ్లీ నాటి సమైక్య పరిపాలన రోజులు యాదికొస్తున్నాయి.
వారంలో రెండు, మూడు రోజుల పవర్ హాలీడేలు పునరావృతం అవుతాయా..? అనే సంశ యం పారిశ్రామికవేత్తల్లో నెలకొన్నది. ఎందుకైనా మంచిదని పరిశ్రమలు ఇప్పు డు విద్యుత్ జనరేటర్లను కొంటున్నాయి. ఈ ఏడాది జనరేటర్ల కొనుగోలు రెట్టింపు అయ్యిందని సమాచారం. కొన్నేండ్లుగా వాడుకలో లేని జనరేటర్లను పరిశ్రమలు తిరిగి మరమ్మతులు చేయిస్తున్నాయి. కొన్ని చిన్నతరహా పరిశ్రమలు విద్యుత్ కోతలు ఇక ఉండవని వాటి పరిశ్రమలో జనరేటర్ల ఏర్పాటుకు స్థలం కూడా వదల్లేదు. ఇప్పుడు జనరేటర్లను కొని పరిశ్రమ బయట రోడ్డుపక్కన పెట్టుకుంటున్నాయి.
పాశమైలారంలోని చాలా పరిశ్రమల యాజమాన్యాలు గత ఆగస్టు నుంచే జనరేటర్లను బుక్ చేసుకున్నాయి. వారి అనుమానం నిజం అన్నట్టుగానే ఈ ఫిబ్రవరి నుంచే పరిశ్రమలకు అప్రకటిత విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. మరమ్మతుల పేరున, ఫీజులు పోయాయని, ఇతర కారణాలు చెబుతూ తరుచుగా విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేస్తున్నారు.
విద్యుత్ కోతలను ముందే ఊహించిన పలు పరిశ్రమల యాజమాన్యాలు జనరేటర్లను బుక్ చేసుకున్నాయి. ఇప్పటికే ఆర్డర్లు ఫుల్ ఉన్న పరిశ్రమలు ప్రత్యామ్నాయంగా జనరేటర్లను తెచ్చుకున్నాయి. జనరేటర్ల ద్వారా యూనిట్ విద్యుత్ ఖర్చు దాదాపు రూ. 20 అవుతుంది. అదే విద్యుత్‌శాఖ ఇచ్చే పవర్‌కు రూ.8 వరకు అవుతుంది. జనరేటర్లతో యూనిట్‌కు రూ. 12 అదనపు ఖర్చు అవుతున్నా ఆర్డర్లు కావద్దనే ఉద్దేశంతో పరిశ్రమలు జనరేటర్లను ఆర్డర్లు ఇస్తున్నాయి.
క్యాస్టింగ్ పరిశ్రమలపై, బాయిలర్ వాడే పరిశ్రమల్లో అప్రకటిత విద్యుత్ కోతలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పవర్‌కట్ కారణంగా ఉత్పత్తులపై ప్రభావం పడుతున్నది. మేలో పవర్ హాలిడే లు తప్పక పోవచ్చని పారిశ్రామికవేత్తలు ఊహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో నాణ్యమైన కరెంట్ సరఫరాతో ధీమాగా ఉన్న పరిశ్రమలు, ఇప్పుడు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. మళ్లీ పాతరోజులను గుర్తు చేసుకుని బెంగపెట్టుకున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని పరిశ్రమల వర్గాలు కోరుతున్నాయి.