నర్సాపూర్, ఏప్రిల్ 6: బర్డ్‌ఫ్లూ మహమ్మారితో తెలుగు రాష్ర్టాల్లో లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ భయంకరమైన వ్యాధితో పౌల్ట్రీ రైతులు పూర్తిగా కుదేలయ్యారు. ఈ మాయరోగంతో కోళ్లు మృత్యువాత పడి భారీగా నష్టపోయారు. కానీ, ఓ పౌల్ట్రీ రైతు తను పాటించిన బయోసెక్యూరిటీతో ఒక్క కోడి కూడా చనిపోకుండా లాభాల బాట పట్టి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన శ్రీనివాస్‌గౌడ్ బయోసెక్యూరిటీ పద్ధతులు పాటించి బర్డ్‌ఫ్లూను తట్టుకున్నాడు.
తనకున్న 6 వేల పౌల్ట్రీ షెడ్డులో 9 ఏండ్లుగా బాయిలర్ కోళ్లను పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. కానీ, ఈసారి నాటుకోళ్ల పెంపకానికి ఆసక్తి కనబరిచాడు. అనుకున్నదే తడువుగా తనకున్న షెడ్డులో రూ.7 లక్షల పెట్టుబడి పెట్టి 3500 నాటుకోడి పిల్లలను తెచ్చాడు. నాటుకోళ్లు వేసిన కొన్ని రోజుల తర్వాత బర్డ్‌ఫ్లూ మహమ్మారి తెలుగు రాష్ర్టాల్లో పంజా విసిరి లక్షల కోళ్లను పొట్టన పెట్టుకుంది. తన షెడ్డుకు సమీపంలోని ఫామ్‌లో కోళ్లు, చుట్టుపక్కల గ్రామాల్లోని కోళ్లు వరుసబెట్టి చనిపోవడం ప్రారంభించాయి. ఇది గమనించిన పౌల్ట్రీ రైతు శ్రీనివాస్ అధైర్యపడలేదు. వెటర్నరీ అధికారులను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకుని కోళ్లు చనిపోకుండా జాగ్రత్తపడ్డాడు.
పౌల్ట్రీ రైతు శ్రీనివాస్‌గౌడ్ బయోసెక్యూరిటీ విధానాన్ని పాటించి ఒక్కటంటే ఒక్క కోడి చనిపోకుండా కోళ్లను పూర్తిస్థాయిలో కాపాడుకోగలిగాడు. ఈ బయోసెక్యూరిటీలో భాగంగా డ్రింకర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం, సమయానికి దాణా వేయడం, ట్యాంకర్‌ను శానిటేషన్ చేయడం, ట్యాంక్‌లో ఇన్నోసెంట్ ట్యాబ్లెట్లను వాడడం, పౌల్ట్రీఫామ్ చుట్టూ, పరిసరాల్లో ఫార్మోలిన్ను పిచికారీ చేయడం, లిట్టర్ కండీషన్ బాగుండేలా జాగ్రత్త పడడం, బయటి వ్యక్తులను లోనికి అనుమతించకపోవడం,
కుక్కలను దరిదాపులోకి రానివ్వకపోవడం, దాణా వాహనదారులకు, హమాలీలకు శానిటైజేషన్ చేసి అనుమతివ్వ డం, షెడ్డులో, చుట్టుపక్కల సున్నం, అల్లంవెల్లులి, బ్లీచింగ్ ఫౌడర్ పిచికారీ చేయడం ద్వారా ఎలాంటి క్రిమికీటకాలు షెడ్డులోకి రాకుండా అడ్డుకున్నాడు. దీంతో బర్డ్‌ఫ్లూ మహమ్మారి తన షెడ్డుకు రాలేకపో యింది. తాను, కుటుంబ సభ్యులు రెండు జతల చెప్పులను వాడుతూ ఓ జత ఆరుబయట, మరో జత పౌల్ట్రీఫామ్‌లో వాడుతూ ఎలాంటి క్రిములు చొరబడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాడు.
నాటుకోళ్లు కోత దశకు రాగానే ఎలా అమ్మాలో అనే ఆలోచనలో రైతు శ్రీనివాస్‌గౌడ్ పడ్డాడు. ముందుగా తనకున్న సోషల్‌మీడియా యాప్‌ల ద్వారా రైతు శ్రీనివాస్‌గౌడ్, అతని కుమారులు నాటుకోళ్లు అమ్మబడుననే ప్రచారాన్ని వేగవంతం చేశారు. దీంతో చికెన్ సెంటర్ యజమానులు ముందుకు వచ్చి కోళ్లను కొంటామనడంతో బల్క్ మీద వారికి కిలోకి రూ. 230 నుంచి 240 వరకు విక్రయించారు. ఇతరులకు పుంజుకు రూ.400, పెట్టకు రూ.300 చొప్పును అమ్మారు. ఇలా 3500 కోళ్లకు 3000 కోళ్లను విక్రయించారు. ఇప్పటికే పెట్టుబడి పోను రూ.70 వేలు లాభం వచ్చిందని పౌల్ట్రీ రైతు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
నాటుకోళ్లు షెడ్‌కు తెచ్చిన నాటి నుంచి వాటిని కంటికి రెప్పలా కాపాడుకున్నా. రాత్రిపగలు దరిదాపులకు ఇతర మనుషులు కానీ, కుక్కలు రాకుండా జాగ్రత్తలు పాటించాం. నాటుకోళ్లు తెచ్చిన ఒకనెల అంతా బాగానే ఉంది. ఆ తర్వాత బర్డ్‌ఫ్లూ వచ్చి కోళ్లు చనిపోతున్నాయని తెలుగు రాష్ట్రాల్లో పుకార్లు లేచాయి. నా చుట్టు పక్కల గల ఫౌల్ట్రీ షెడ్లలో కోళ్లు చనిపోయి షెడ్లు పూర్తిగా కాలి అయ్యాయి. మొదట్లో నేను కూడా ఆందోళన చెందాను. వెటర్నరీ అధికారులను సంప్రదించి బయోసెక్యూరిటీ పద్ధ్దతి పాటించాను. దీంతో నా షెడ్డుకు ఎలాంటి వైరస్ రాలేదు. కండ్లలో ఒత్తులు వేసుకొని కాపాడుకున్నా. కష్టపడితే లాభాలు ఎక్కడ పోవని నాకు తెలిసివచ్చింది.