జహీరాబాద్, అక్టోబర్ 26 : రహదారులు బాగుంటేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధిని విస్మరించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఆర్అండ్బీ రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మరమ్మతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం స్ట్టేట్ ఫండ్ కింద జహీరాబాద్ నియోజకవర్గానికి రూ. 12.32 కోట్ల నిధులు మంజూరు చేసింది.
ఈ నిధులతో నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలంలోని చాల్కి, చీకూర్తి మీదుగా కర్ణాటక బార్డర్ వదరకు రోడ్డు మరమ్మతులకు రూ.1.58 కోట్ల నిధులు కేటాయించారు, అల్లాదుర్గం-మెటల్కుంట రోడ్డుకు రూ. 8.17 కోట్లు, రాంతీర్థం, వడ్డి గ్రామాల మధ్యనున్న రోడ్డుకు రూ.1.53 కోట్లు, కోహీర్-గోడిగార్పల్లి, బడంపేట రోడ్డుకు రూ.1.18 కోట్లు, జహీరాబాద్ నుంచి చించోళి రోడ్డుకు రూ. 4.30 కోట్లు, పీఆర్ కోహీర్ నుంచి గోడిగార్పల్లి రోడ్డుకు రూ.1.27 కోట్లు, అసద్గంజ్ నుంచి ఖాసీంపూర్ రోడ్డుకు రూ.1.93 కోట్లు, జహీరాబాద్ నుంచి చించోళి రోడ్డు మధ్య కల్వర్టు నిర్మాణానికి రూ.11లక్షలు, గోడిగార్పల్లి సమీపంలో కల్వర్టు నిర్మాణానికి రూ. 14 లక్షలు, వడ్డి, రాంతీర్థం వెళ్లే రోడ్డుపై కల్వర్టు నిర్మాణానికి రూ.11 లక్షల నిధులు మంజూరు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, బిల్లులు రావడం లేదనే సాకుతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. దీంతో రోడ్లు మరమ్మతులకు నోచుకోవడం లేదు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.
దీంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఆయా గ్రామాలకు వెళ్లే రోడ్లపై బీటీ కోతకు గురై గుంతలు ఏర్పడి కంకర తేలింది. మోకాళ్లలోతు గోతులు ఏర్పడి వాహనాలు అదుపు తప్పుతున్నాయి. సింగిల్ రోడ్డుతో వాహనదారులు రోజు ఎక్కడోచోట ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రిపూట రోడ్డుపై వెళ్లాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పోవాల్సిన పరిస్థితి దాపురించిందని వాహనదారులు, ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయించాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.