హుస్నాబాద్టౌన్, సెప్టెంబర్ 11: భారీ వర్షాల కారణంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ఉధృతి కారణంగా రోడ్లు ధ్వంసం కావడమే కాకుండా కోతకు గురయ్యాయి. దీంతో ఆ రహదారుల వెంట వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది.
రోడ్డు పూర్తిస్థాయిలో కోతకు గురికావడం, ధ్వంసమైనప్పటికీ సంబంధిత ఆర్అండ్బీ అధికారులు తాత్కాలిక మరమ్మతులు సైతం చేపట్టలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులతోపాటు పలు వార్డుల్లో సైతం వరద కారణంగా రోడ్లు దెబ్బతిన్నప్పటికీ మరమ్మతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని ప్రజలు డి మాండ్ చేస్తున్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలిగించాలని కోరుతున్నారు.