మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 27: సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని బీటీ రోడ్లు అధ్వానంగా మారాయి. బీటీ రోడ్లపై గుంతలు ఏర్పడడంతో సదరు రోడ్లపై వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారినపడుతున్నారు. రోడ్లు దెబ్బతిని కంకరతేలడంతో కనీసం వాహనాలు నడుపలేని దుస్థితిలో ఉన్నాయి. రాత్రి సమయంలో బీటీ రోడ్లపై ప్రయాణం చేసేందుకు వాహనదారులు జంకుతున్నారు.
మద్దూరు-ముస్త్యాల, వల్లంపట్ల-కూటిగల్, బెక్కల్-వల్లంపట్ల, బెక్కల్-తోర్నాల, ధూళిమిట్ట-జాలపల్లి, తోర్నాల గ్రామాల మధ్య బీటీ రోడ్లు దెబ్బతిన్నాయి. ఆయా గ్రామాల మధ్య పాడైన బీటీ రోడ్లకు మరమ్మతులు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. వల్లంపట్ల-కూటిగల్ గ్రామాల మధ్య మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో నిర్మాణ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డుపై ఏర్పడ్డ గుంతల్లో కంకరపోసి పనులను అర్థాంతరంగా నిలిపివేశాడు. తొలుత మరమ్మతులకు ప్రభుత్వం టెండర్లు పిలిచి దానిని అర్ధాంతరంగా నిలిపేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులు తక్షణమే స్పందించి పాడైన బీటీ రోడ్లకు మరమ్మతులు చే యాలని మద్దూరు, ధూ ళిమిట్ట మండలాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.