హుస్నాబాద్, ఆగస్టు 23: హుస్నాబాద్ నియోజకవర్గంలో యూరియా కొరత లేకుండా సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మాట్లాడానని, యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాకతీయుల నాటి ఎల్లమ్మ చెరువును ఆధునీకరించి సుందరీకణ చేయడం ద్వారా పర్యాటక కేంద్రంగా తయారు చేసేందుకు జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
శనివారం హుస్నాబాద్‌లోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన చెరువు కట్టపై జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాకతీయుల కాలంలో నిర్మాణమైన ఎల్లమ్మ గుడికి, చెరువుకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని, రూ.15కోట్ల నిధులతో ఎల్లమ్మ చెరువు ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. దసరా పండుగ వరకు పనులు దాదాపుగా పూర్తి కావాలన్నారు. ఎల్లమ్మ గుడిని భక్తులకు సౌకర్యంగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.
సర్కారు దవాఖాన నూతన భవన నిర్మాణ పనులు మొదలయ్యాయని, పూర్తి కాగానే పీజీ కాలేజీ ప్రారంభం అవుతుందని చెప్పారు. కొత్త చెరువును కూడా మినీ ట్యాంక్‌బండ్‌గా తయారు చేస్తామన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ కింద కాలువల నిర్మాణం కోసం జరిగే భూసేకరణకు రైతులు సహకరించాలని మంత్రి కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ శివయ్య, ఎల్లమ్మ ఆలయం ఈవో కిషన్‌రావు, ఆర్చకులు పరమేశ్వరశర్మ, అధికారులు పాల్గొన్నారు.