హుస్నాబాద్/అక్కన్నపేట/ హుస్నాబాద్ రూరల్, జూలై 10: కరువు పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఆయిల్‌పామ్ లాంటి పంటలపై రైతులు దృష్టి సారించి అధిక ఆదాయం పొం దాలని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ పిలుపునిచ్చారు.
శుక్రవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని జనగామలో మెగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ ప్రారంభం, హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌లో ఏటీసీ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, హుస్నాబాద్‌లోని తిరుమల గార్డెన్లో మెగా జాబ్‌మేళా ప్రారంభం, హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామ శివారులో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల భవన నిర్మాణ పనులకు వారు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో మంత్రులు మాట్లాడుతూ.. హుస్నాబాద్ ప్రాంతంలో 50వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలనే లక్ష్యాన్ని రైతులు నెరవేర్చాలని కోరారు.
100ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసిన గ్రామానికి తలో రూ.5లక్షల నిధులు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. హుస్నాబాద్‌లో ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాల ఉన్నదని, కొత్తగా రూ. 29 కోట్లతో ఇంజినీరింగ్ కళాశాల, రూ. 45కోట్లతో ఏటీసీ సెంటర్ ప్రారంభమవుతున్నందున హుస్నాబాద్ సాంకేతిక విద్యాకేంద్రంగా మారనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమాల్లో మున్నూరుకాపు కార్పోరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్‌చక్రవర్తి, ఉపాధి శిక్షణా శాఖ డైరెక్టర్ క్రాంతివెస్లీ, శాతవాహన వర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్, సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో రామ్మూర్తి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.