కోహెడ, ఏప్రిల్ 4: విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాకారానికి కృషిచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమం , రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కోహెడ మండలంలోని నాగసముద్రాల మాడల్ స్కూల్‌ను కలెక్టర్ మను చౌదరితో కలిసి సందర్శించి గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నేటి పోటీ ప్రపంచంలో రాణించాలంటే నైపుణ్యాలు పెంపొందించుకోవడం ఎంతైనా అవసరం అన్నారు.
మంచి కెరీర్‌కు చదువుతో ఎంతో అవసరం అన్నారు. ఎంపీగా పనిచేసినప్పుడు 32 మండలాలకు 29 మాడల్ స్కూల్స్ తెచ్చినట్లు గుర్తుచేశారు. మాడల్ స్కూల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వాటర్ ప్లాంట్ నిర్మాణం చేపడతామన్నారు. అనంతరం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. పాఠశాల విద్యార్థులకు కొత్త యూనిఫాం పెడుతున్నామని, గోడలకు పెయింట్ వేస్తున్నామని, వాష్‌రూమ్‌లో నీటి సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అనంతరం చెంచల్చెర్వుపల్లిలో జైబాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఆర్డీవో రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బోయిని నిర్మల, వైస్ చైర్మన్ భీంరెడ్డి తిరుపతిరెడ్డి, మంద ధర్మయ్య, గాంధీజ్ఞాన్ ఫౌండేషన్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో కిష్టయ్య, తహసీల్దార్ సురేఖ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.