హుస్నాబాద్, సెప్టెంబర్ 22: పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో సోమవారం సతీసమేతంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎల్లమ్మ చెరువు కట్టపై జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు, గ్రామ కార్యదర్శులతో సమీక్షలు నిర్వహించి బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కాకతీయుల కాలం నాటి హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తవుతాయన్నారు.
ఇక్కడ జరుగబోయే బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రామ్‌లీలా, దసరా పండుగ వేడుకలను కూడా ఘనంగా నిర్వహిస్తామన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, చిత్తారి రవీందర్, కిష్టస్వామి తదితరులు పాల్గొన్నారు.