హుస్నాబాద్‌టౌన్, ఏప్రిల్ 28: హుస్నాబాద్ పట్టణాన్ని అన్నింటా ముందుంచేందుకు కృషిచేస్తానని బీసీసంక్షేమం, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ అన్నారు. సోమవారం రాత్రి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ మాజీ పాలకవర్గ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ భూసేకరణ కోసం నిధులు కేటాయించడం జరిగిందని, కాల్వల పనులు సైతం జరుగుతున్నాయని చెప్పారు.
హుస్నాబాద్‌కు ఇంజినీరింగ్ కళాశాలను సైతం తీసుకురావడం జరిగిందని, పరిశ్రమలతో పాటు పలు విద్య, వైద్య సదుపాయాలను సైతం కల్పించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తామని, ప్లాస్టిక్నివారణ కోసం స్టీల్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు కృషిచేయాలని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లాగ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండోచైర్మన్ బొలిశెట్టి శివయ్య, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, మాజీ వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, కమిషనర్ టి. మల్లికార్జున్‌గౌడ్,పలువురు మాజీకౌన్సిలర్లు పాల్గొన్నారు.