హుస్నాబాద్, నవంబర్ 23: మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ కె.హైమావతితో కలిసి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రేషన్‌కార్డులు ఇవ్వడం, సన్న బియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, ఉచిత ప్రయాణం, మహిళా క్యాంటీన్ల ఏర్పాటు, ఆర్టీసీ బస్సుల కేటాయింపులు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీవో రామ్మూర్తి, డీఆర్వో జయదేవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్‌విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 23: మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆదివారం సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డితో కలిసి మంత్రి హాజరై చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్వయం ఉపాధి పథకాల ద్వారా వేలాది మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు.
తెల్లరేషన్ కార్డులో పేరు నమోదై ఉండి పార్టీలతో సంబంధం లేకుండా 18ఏండ్లు పైబడిన మహిళలందరికీ ఇందిరమ్మ చీరల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫయీమ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, సీడీసీ చైర్మన్ రాంరెడ్డి, అదనపు డీఆర్డీవో సూర్యారావు, జిల్లా మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.