వర్గల్, జూలై 6: అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఆయన పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులను సమాయత్తం చేస్తుందన్నారు. లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్ఱెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల విషయం లో దుబ్బాక నియోజకవర్గంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో అర్హులకు పట్టాలు ఇవ్వగా వారిలో కొంతమంది లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనం చేకూరిందన్నారు. సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి ప్రసంగిస్తున్న క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. గ్రామాల్లో జరుగుతున్న ప్రభుత్వ పథకాల అమలు విషయంలో తమకు సమాచారం ఇవ్వడం లేదని మండిపడ్డారు. కలెక్టర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు రంగప్రవేశం చేసి నినాదాలు చేస్తున్న కార్యకర్తలను సముదాయించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జి.వివేక్, జిల్లా, మండల స్థాయి అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.