కంది, సెప్టెంబర్ 8 : భారీ వర్షాలతో చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని చెరువులు, కుంటలన్నీ పూర్తిగా నిండుకుండలా మారి అలుగులు పారుతున్నాయి. కంది పాత చెరువు మత్తడిదూకి ప్రధాన రహదారిపై పారుతుండటంతో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి రహదారిని మూసివేశారు.
వర్షాలతో గ్రామాలు, తండాలకు వెళ్లే రహదారులన్నీ చిత్తడిగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంది పాత చెరువు పొంగిపొర్లింది. చిమ్నాపూర్ రహదారి కోతకు గురై పంటలు దెబ్బతిన్నాయి. స్థానికులు వరద ప్రవాహాన్ని తిలకించి సెల్ఫీలు తీసుకోవడంతో పాటు చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.