కోహీర్, ఆగస్టు 10: సంగారెడ్డి జిల్లా కోహీర్ పట్టణంతో పాటు కవేలి, బిలాల్పూర్, దిగ్వాల్, చింతల్‌ఘాట్, కొత్తూర్, వెంకటాపూర్ తదితర గ్రామాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. కోహీర్-కవేలి గ్రామాల మధ్య ఉన్న నారింజవాగు ప్రవహించడంతో సమీపంలోని పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, కంది తదితర పంటలు నష్టపోయే అవకాశం ఉందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సర్వే నిర్వహించి తమను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
నిండుకున్న కుంటలు
నిజాంపేట, ఆగస్టు 10: మెదక్ జిల్లా నిజాంపేట మండలం వ్యాప్తంగా ఆదివారం వర్షం కురిసింది. దీంతో గ్రామాల్లోని కుంటలు నిండి అలుగు పారుతుండగా..చెరువుల్లోకి వరద చేరుతున్నది.10 రోజుల తర్వాత సమృద్ధిగా కురుస్తున్న వర్షాలకు రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో బిజీగా మారారు.రెండు రోజులుగా కురిసిన వర్షానికి నిజాంపేటలోని కంటయ్యకుంట నిండుకుండలా మారింది. వరిపొలాల్లోకి నీరు చేరింది.
రామాయంపేట మండలంలో…
రామాయంపేట, ఆగస్టు 10: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లా ఉమ్మడి రామాయంపేట, నిజాంపేట మండలాల్లో చెరువులు నిండుతున్నాయి. ఇప్పటికే రామాయంపేట పట్టణంలోని హనుమచెరువు, మండలంలోని కోనాపూర్‌లో పెద్ద చెరువులు అలుగులు దుంకుతున్నాయి.అలుగులు పారడంతో కాల్వల ద్వారా ఇతర చెరువులకు నీరు చేరుతున్నది.
రామాయంపేట, నిజాంపేట మండలాల్లోని నందిగామ, రాయిలాపూర్, సుతారిపల్లి, అక్కన్నపేట, తొనిగండ్ల తదితర చెరువుల్లోకి నీరు చేరుకున్నది.మరోవర్షం పడితే రెండు మండలాల్లోని దాదాపు అన్ని చెరువులు నిండనున్నాయి. చెరువుల నుంచి చేపలు బయటకు వెళ్లకుండా మత్స్యకారులు అలుగులకు వలలు అడ్డువేస్తున్నారు.రామాయంపేటలో వర్షం దంచికొట్టడంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, పాత ఎస్బీహెచ్, రాజేంద్రనగర్, హరిజనకాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
పొంగిపొర్లుతున్న చెక్‌డ్యామ్‌లు
వెల్దుర్తి, ఆగస్టు 10: రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు మెదక్ జిల్లా వెల్దుర్తి, మాసాయిపేట మండల పరిధిలోని హల్దీవాగులో భారీగా నీరు చేరుతుండగా పలు గ్రామాల పరిధిలో ఉన్న చెక్‌డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్త్తరు వర్షం పడగా శనివారం ఉదయం ఏడుగంటల నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం కురిసింది. దీంతో మండలంలోని పలు చెరువులు, కుంటలతో పాటు హల్దీవాగులోకి భారీగా నీరు చేరుతున్నది. వెల్దుర్తి మండలంలోని దామరంచ గ్రామ శివారులో హల్దీవాగుపై ఉన్న చెక్‌డ్యామ్ పొంగిపొర్లుతూ కిందికి ప్రవహిస్తున్నది.