మెదక్, మే 14(నమస్తే తెలంగాణ): మెదక్ పార్లమెంట్ పరిధిలో పోలింగ్ సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే సాయంత్రం 5 గంటల వరకు 71.33శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత క్యూలో ఉన్నవారికి ఓటుహక్కును కల్పించారు. దీంతో పోలింగ్ శాతాన్ని మంగళవారం మధ్యాహ్నం అధికారులు విడుదల చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో 75.09శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 18,28,210 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 9,02,110 మంది కాగా, స్త్రీలు 9,25,891 మంది ఉన్నారు. ఇతరులు 209 మంది ఉన్నారు. ఏడు నియోజకవర్గాల పరిధిలో 2,124 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 84.25 శాతం ఓట్లు పోల్ కాగా, అత్యల్పంగా పటాన్చెరు నియోజకవర్గంలో 63.01శాతం ఓట్లు పోలయ్యాయి.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో 71.71 శాతం పోలింగ్ నమోదైంది. పార్లమెంట్ పరిధిలోని అత్యధికంగా నర్సాపూర్ నియోజకవర్గంలో 77.75 శాతం ఓట్లు పోలయ్యాయి. అత్యల్పంగా పటాన్చెరు నియోజకవర్గంలో 65.13 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 71.71 శాతం పోలింగ్ నమోదైంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 75.09 శాతం పోలింగ్ నమోదు కాగా, నర్సాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 84.25 శాతం ఓట్లు పోల్ కాగా, అత్యల్పంగా పటాన్చెరు నియోజకవర్గంలో 63.01 శాతం ఓట్లు పోలయ్యాయి. దీంతో గతంలో కంటే 3.38 శాతం పోలింగ్ పెరిగింది.
సోమవారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియడంతో అర్ధరాత్రి వరకు ఈవీఎంలను మెదక్ జిల్లా నర్సాపూర్లోని బీవీఆర్ఐటీ కళాశాలలకు తరలించారు. మంగళవారం పటిష్ట భద్రత నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపర్చుటకు సీల్ వేశారు. అనంతరం సాధారణ పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్కోటి, జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ సమక్షంలో సంబంధిత నియోజకవర్గాల ఏఆర్వోలు, రాజకీయ పార్టీ ప్రతినిధులు, మైక్రో అబ్జర్వర్లు స్ట్రాంగ్ రూంలో భద్రపర్చారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ టీవీ కెమెరాల మధ్య కేంద్ర ప్రభుత్వ సాయుధ దళాల పహారాలో స్ట్రాంగ్ రూంలు ఉండనున్నాయి. గజ్వేల్, దుబ్బాక, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట నియోజకవర్గాల ఈవీఎంలను బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో, సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల ఈవీఎంలను ప్రభుత్వ గిరిజన బాలుర జూనియర్ కళాశాలలో భద్రపర్చారు.
మెదక్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారంతో పూర్తయింది. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్సు నిక్షిప్తం చేసి ఉంచారు. అయితే ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టనున్నారు. అంటే 20 రోజులపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపుతో పాటు పోస్టల్ బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో భద్రపర్చారు.