నర్సాపూర్, ఏప్రిల్ 3: హెచ్‌సీయూ విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జి హేయమైన చర్య అని, పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. గురువారం నర్సాపూర్ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విశ్వవిద్యాలయ భూమిని పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, దీనికోసం 400 ఎకరాల భూమిలో హరిత హననం చేస్తున్నదని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులతో లాఠీలు ఝుళిపించి జైలుకు పంపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రోజుకో దారుణ ఘటన వెలుగుచూస్తున్నదని, సీఎం రేవంత్ దగ్గర ఉన్న అన్ని శాఖలు విఫలమయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం పోలీసులకు ఇతర పనులు అప్పజెప్పడం మూలంగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పినట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు సత్యంగౌడ్, సుధాకర్‌రెడ్డి, సూరారం నర్సింహులు, రింగుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.