Cyber Crime | జహీరాబాద్, ఏప్రిల్ 2 : ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ వంటి సైబన్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని హద్నూర్ పోలీసులు సూచించారు. బుధవారం న్యాల్కల్ మండలంలోని హద్నూర్ గ్రామ బస్టాండ్ చౌరస్తాలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ సేవాలాల్ , శ్యామయ్య మాట్లాడుతూ.. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం పిన్ నెంబర్లు, ఓటీపీ వివరాలు చెప్పవద్దన్నారు. ఆశ చూపిస్తే వాటికి ఆకర్షితులు కావొద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేయాలని సూచించారు. వ్యక్తిగత ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దన్నారు. పోలీస్ శాఖకు బ్యాంకు ఖాతాల వివరాలు అవసరం లేదని తెలిపారు. మీకు పదేపదే ఫోన్ చేసి విసిగిస్తే మీకు అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. మొబైల్ ఫోన్‌కు గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్ చేసి బ్యాంకు లోన్లు ఇప్పిస్తామని చెబితే నమ్మి మోసపోవద్దు అని చెప్పారు.
గ్రామాల్లో గంజాయి సాగుకు పాల్పడినా, రవాణా చేసినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు రద్దవుతాయన్నారు. మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్ నాశనమవుతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో గొప్పవాళ్ళను చేయాలనే ఆశతో ఉంటే కొంత మంది యువత డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేసేవారి ఆట కట్టించడానికి పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. యువత ఎక్కువ మంది మత్తుపానీయాలకు, మత్తు పదార్థాలకు బానిసలై రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు వదులుకుంటున్నారని, కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే యువతే కీలకమని, అటువంటి యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడాలని సూచించారు.
ఐపీఎల్ బెట్టింగ్స్, ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్లొద్దన్నారు. ఐపీఎల్ సీజన్ మొదలు కావడంతో దేశమంతా క్రికెట్ అభిమానులు ఊగిపోతున్నారన్నారు. సాయంత్రం అయిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారన్నారు. పట్టణాల్లో కాకుండా పల్లెల్లోకి కూడా ఈ విష సంస్కృతి పాకుతోంది. నిర్వాహకులు దీని ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే బెట్టింగ్ పెట్టిన వారు గంటల వ్యవధిలో వేల నుంచి లక్షల రూపాయలను నష్టపోతున్నారు. ఈ ఊబిలో చిక్కుకున్న మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చదువుకోవాల్సిన వయసులో బెట్టింగ్‌లు కాస్తూ వేల నుంచి లక్షల రూపాయలను పోగొట్టుకుంటున్నారన్నారు. ఈ వ్యసనం వదలలేక అప్పులు చేస్తున్నారన్నారు. రుణయాప్‌లను ఆశ్రయిస్తున్నారు. అప్పులు తిరిగి చెల్లించలేక ఆ ఒత్తిడిలో చదువులను గాలికి వదులుతున్నారు. అప్పుల ఒత్తిడి ఇంకా ఎక్కువైతే ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.