సిద్దిపేట, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే రోజులు మళ్లీ వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానలను పట్టించుకోవడం లేదు. కనీస అవసరాలు కూడా సమకూర్చడం లేదు. కొన్ని నెలలుగా ప్రభుత్వ దవాఖానల్లో మం దులు లేవు. ఇవ్వడానికి మందులు లేక వైద్యులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ దవాఖానలకు వెళ్తే బయటకు మందులు రాస్తున్నారని జ్వర బాధితులు వాపోతున్నారు.
పేదల కోసం కట్టించిన ప్రభుత్వ దవాఖానల్లో మందులు లేకపోతే తాము ఎట్లా ..? తమ వద్ద డబ్బులు లేకనే ప్రభుత్వ దవాఖానలకు వస్తిమి..ఇక్కడేమో మందులు బయట తీసుకొమ్మని చెప్పవట్టిరి అని పేదలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రతి దవాఖానలో పూర్తి స్థాయిలో మం దులు అందుబాటులో ఉంచేవారు. దీంతో పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మందుల కొరత ఉంది. ప్రభుత్వ దవాఖానలను పట్టించుకునేవారు లేరు.
సిద్దిపేట జిల్లా ప్రభుత్వ దవాఖానలో కొద్ది రోజులుగా మందుల కొరత ఉంది. మందులు లేక సిబ్బంది బయటకు రాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. వైరల్ జ్వరాలతో పాటు ఒళ్లు నొప్పులు, దగ్గులు, తల నొప్పి, వాంతులు ఇతర రోగా లు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి.
ప్రతి గ్రామంలో సగం మంది జనం జ్వరాలతోనే బాధపడుతున్నారు. పీహెచ్‌సీల్లో సరిపడా మందులు కూడా లేవు. ఆయా ప్రాథమిక కేంద్రాలు, జనరల్ దవాఖానల్లోనూ వైద్య సిబ్బంది కొరత ఉంది. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలకు వెళ్తే అంతంతమాత్రంగానే వైద్యం అందుతుందని రోగులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన దామోదర రాజ నర్సింహ ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. ఆయన ఉన్న జిల్లాలోనే ప్రభుత్వ దవాఖానల నిర్వాహణ ఇలా ఉంటే మిగతా జిల్లాలో ఏరకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
సిద్దిపేట ప్రభుత్వ జనరల్ దవాఖానలో రోజూ ఔట్ పేషెంట్లు 1,400 నుంచి 1,500 మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. దవాఖానలో ఐపీ 420 నుంచి 450 వరకు నమోదవుతున్నది. ప్రస్తుతం ఒక రోజుకు 100 ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. సీజనల్ వ్యాధులకు సంబంధించి 254 కేసులు దవాఖానలో అడ్మిట్ అయ్యారు. వీరిలో 27 డెంగీ కేసులు ఉన్నాయి. కొన్ని నెలలుగా దవాఖానలో వాటర్ ప్లాంట్లు పనిచేయక రోగులు మిషన్ భగీరథ నీళ్లే తాగుతున్నారు.వాటర్ ఫిల్టర్లు పనిచేయడం లేదు.సిద్దిపేట ప్రభుత్వ దవాఖానతోపాటు పీహెచ్‌సీల్లో ఇంజక్షన్లు, మందులు అందుబాటులో లేవు.
సాధారణంగా చిన్న చిన్న రుగ్మతల కోసం ఇచ్చే మందులు లేకపోవడంతో రోగులు బయ ట కొనుక్కుంటున్నారు. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాల్లో 250 ఎంజీ , 500 ఎంజీ మందులతో పాటు ఇతర ఇంజక్షన్లను రోగులు బయట తీసుకొచ్చుకుంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వ దవాఖానల్లో వివిధ రకా ల యాంటీబయోటిక్స్, పిల్లల దగ్గు మందులు లేవు. అన్ని దవాఖానల్లో మందుల కొరత ఉంది. సంగారెడ్డి జిల్లా దవాఖానలో వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి 110 డెంగీ కేసులు నమోదు కాగా 100 చికెన్ గున్యా, 90 వరకు టైఫాయిడ్ కేసులు ప్రభుత్వ దవాఖానల్లో నమోదయ్యాయి. ఇక ప్రైవేట్ దవాఖానల్లో ఆలెక్క అధికంగానే ఉంది. మెదక్ జిల్లాలో సైతం డెంగీ, టైఫాయిడ్ కేసులు విజృంభిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ దవాఖానల్లో జ్వర బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. దోమలు విపరీతంగా ఉండడంతో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం లోపించింది. వందల సంఖ్య లో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. డెంగీతో మరణించిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
ఎక్కడికక్కడ చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. మోరీ లు శుభ్రం చేయక దోమల బెడద ఎక్కువైంది. గ్రామా ల్లో నిధులు లేక కార్యదర్శులు అప్పులు చేసి పెడుతున్నారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత గ్రామాలకు పైసా ఇవ్వలేదు. దీంతో కార్యదర్శులు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ హ యాంలో పల్లెప్రగతి ద్వారా నిధులు ఇవ్వడం వల్ల గ్రామాలు పరిశుభ్రమైన వాతావరణంలో ఉన్నాయి. ఫలితంగా జ్వరాల సంఖ్య తక్కువగా నమోదైంది.