సిద్దిపేట, సెప్టెంబర్ 12: సిద్దిపేట జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసన వర్షాలతో పాటు పారిశుధ్యం పడకేసి పల్లెలు, పట్టణాల్లో ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. ముందస్తుగా ఇంటింట జ్వరం సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం అధికారులు పెడచెవిన పెట్టారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడి జనం ఆల్లాడిపోతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ చెబుతున్న లెక్కల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటి వరకు ఈ సీజన్లో 14,867 ఫీవర్ కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్ దవాఖానల్లోనూ చాలామంది చికిత్స పొందారు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో 84 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. 69 టైఫాయిడ్, 1 మలేరియా కేసు, 1856 డయేరియా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇటీవల పలువురు డెంగీతో మరణించారు. కానీ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వాటిని డెంగీ మరణాలుగా నమోదు చేయలేదని బాధిత కుటుంబాలు తెలిపాయి. జిల్లాలోని పీహెచ్సీలు,సీహెచ్సీలు, జిల్లా దవాఖానలు, జనరల్ దవాఖానల్లో నిత్యం 5650 వరకు ఓపీ నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ దవాఖానల్లో చేరిన వారి సంఖ్య లెక్క లేదు.