ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ జోరు పెంచింది. ఎన్నికల ప్రకటనకు ముందే సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాకిచ్చారు. సంగారెడ్డి జిల్లాలో పార్టీ తరఫున సిట్టింగులకే మళ్లీ అవకాశం ఇవ్వగా, సంగారెడ్డి నుంచి మాజీ ఎమ్మెల్యే, హెచ్‌డీసీ చైర్మన్ చింతాప్రభాకర్ బరిలో దిగనున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సూచనల మేరకు అభ్యర్థులంతా ఎన్నికలపై కసరత్తులు చేస్తున్నారు. భారీ మెజార్టీయే లక్ష్యంగా పార్టీ అధిష్టానం పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రత్యేకంగా ఇన్చార్జిలను నియమించడంతో పాటు నియోజకవర్గంలోని ముఖ్యనాయకులతో ఎన్నికల పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక గ్రామంలో ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జి, ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక కన్వీనర్‌ను నియమించింది. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో పది మంది కార్యకర్తలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించనున్నది. ప్రచార నిర్వహణతో పాటు కార్యకర్తల పనితీరును పర్యవేక్షించేందుకు క్యాంపెయిన్ ఇన్చార్జిలను ప్రకటించింది.
సంగారెడ్డి అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కదులుతున్నది. అసెంబ్లీ ఎన్నికల రేసులో మిగితా పార్టీ కంటే బీఆర్ఎస్ ముందంజలో ఉన్నది. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదివరకే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందోలు, పటాన్చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరోమారు పోటీ చేయనున్నారు. సంగారెడ్డి నుంచి మాజీఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బరిలో ఉంటారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సూచన మేరకు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు మహిపాల్‌రెడ్డి(పటాన్చెరు) చింతా ప్రభాకర్(సంగారెడ్డి), చంటి క్రాంతికిరణ్(అందోలు),మాణిక్‌రావు(జహీరాబాద్), భూ పాల్‌రెడ్డి(పటాన్చెరు) ఎన్నికల కసరత్తు మొదలుపెట్టారు.
బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలుపొందేలా గ్రామస్థాయి నుంచి మొదలుకుని నియోజకవర్గ స్థాయి వరకు ప్రత్యేకంగా ఇన్చార్జిలను నియమిస్తున్నది. సంగారెడ్డి, పటాన్చెరు, నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఎన్నికల బాధ్యతలు పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున నియోజకవర్గ ఎన్నికల పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో ఈ కమిటీలను వేశారు. అలాగే మండలస్థాయిలో కూడా కమిటీలను వేశారు. ఇక గ్రామస్థాయిలో ప్రతి వంద మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిలను పార్టీ తరఫున నియమించారు. ఒక పోలింగ్ కేంద్రం పరిధిలో పదిమంది క్రియాశీలక కార్యకర్తలకు ఎన్నికల బాధ్యతలను అప్పగించారు. అలాగే ప్రతి పోలింగ్ కేంద్రానికి పార్టీ తరఫున ఒక కన్వీనర్‌ను నియమించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో 281 మంది, అందోలులో 313, పటాన్చెరులో 391, నారాయణఖేడ్‌లో 296, జహీరాబాద్‌లో 313మంది పోలింగ్ బూత్ లెవల్ కన్వీనర్లను నియమించారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్ బూత్‌లెవల్ కన్వీనర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ వచ్చేవారం నుంచి బూత్‌లెవల్ కన్వీనర్ ఇతర ఇన్చార్జిలతో సమావేశం కానున్నారు. పటాన్చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ ఎమ్మెల్యేలు పార్టీ బూత్ లెవల్ కన్వీనర్లతో సమావేశాలు నిర్వహించనున్నారు.
సంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ ఇన్చార్జిలను నియమించింది. అందోలు ని యోజకవర్గ క్యాంపెయిన్ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్సీ ఫారూ ఖ్హుస్సేన్, జహీరాబాద్ క్యాంపెయిన్ ఇన్చార్జిగా మాజీ బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, సంగారెడ్డి అసెంబ్లీ క్యాంపెయిన్ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌లను నియమించింది. పటాన్చెరు, నారాయణఖేడ్ క్యాంపెయిన్ ఇన్చార్జిలను త్వరలోనే నియమించనున్నారు. క్యాంపెయిన్ ఇన్చార్జిలు నియోజకవర్గాలో ఎన్నికల ప్రచార నిర్వహణతోపాటు కార్యకర్తల పనితీరుపై పర్యవేక్షించనున్నారు.