కంది, ఏప్రిల్ 1: కందిలో పదిరోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కిలోమీటర్ల మేర వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుల పేరుతో మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోయిందని, నాలుగు బోర్లున్నా వాటికి మోట ర్లు కరువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి ఎద్దడిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, మహిళలు మంగళవారం రోడ్డెక్కారు. కంది పంచాయతీ కార్యాలయం ఎదుట ఖాళీబిందెలతో బైఠాయించి ధర్నా చేపట్టారు. పది రోజులుగా తాగేందుకు, వాడుకోవడానికి నీళ్లు లేక నరకయాతన పడుతున్నామని వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నీటి సరఫరా లేక ఉగాది, రంజాన్ పండుగలకు నానా తిప్పలు పడ్డామని, స్నానాలు కూడా చేయలేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. పాత కందిలో నాలుగు బోర్లున్నా వాటి మోటర్లు పనిచేయడం లేదన్నారు. నీటి సమస్య తీవ్రంగా ఉందని సంబంధిత పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. జిల్లా, మండల అధికారులు స్పం దించి ఉన్న బోర్లకు వెంటనే మోటర్లు బిగించి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
కందిలో నెలకొన్న నీటి ఎద్దడిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామ మహిళలు ఖాళీబిందెలతో పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడంతో అధికారులు స్పందించి ఒక బోరుకు మరమ్మతులు చేపట్టారు. పాత కందిలో ఉన్న నాలుగు బోర్లకు, ఒక దానికి మాత్రమే అప్పటికప్పడు మరమ్మతులు నిర్వహించారు. కంది తహసీల్ద్ధార్ విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ మల్ల య్య 3వ వార్డులో బోరుకు మరమ్మతులు చేయించి ఆ వార్డుకు నీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్కు మరమ్మతులు పూర్తి చేయించి సమస్యను పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీనిచ్చారు. అప్పటి వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు.