మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 30: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని దుబ్బతండా, హనుమతండా, రెడ్యానాయక్ తండా, బెక్కల్, తోర్నాల పంచాయతీల పరిధిలో సుమారు 21 గిరిజన తండాలు ఉన్నాయి. ఈ తండాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్య నిర్వహణ లోపించడం వల్ల తండాల్లో మురుగు ఏరులై పారుతున్నది. చెత్తాచెదారంతో తండాల్లోని వీధులు నిండిపోయి కంపుకొడుతున్నాయి. తండాల్లో దోమలు, ఈగలు స్వైరవిహారం చేస్తుండడంతో గిరిజనులు మంచానపడుతున్నారు.
డెంగీ, టైపాయిడ్ వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. పారిశుధ్య నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో పంచాయతీ అధికారులు పారిశుధ్య నిర్వహణను గాలికొదిలేశారు. దీనికితోడు మూడు గ్రామ పంచాయతీలకు కార్యదర్శులు కరువయ్యారు.
ఇన్చార్జి కార్యదర్శులు చుట్టపుచూపుగా పంచాయతీలకు వచ్చిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తక్షణమే స్పందించి పంచాయతీలకు కార్యదర్శులను నియమించడంతోపాటు తండాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.
రెడ్యానాయక్ తం డా లో మురుగు బయటకు వెళ్లేందుకు కాల్వలు లేవు. మురుగు నీరంతా రోడ్లపై చేరుతుంది. దీం తో ఈగలు, దోమలు ఎక్కువై తండాలో జనం జ్వరాల బారిన పడుతున్నారు. చెత్తాచెదారాన్ని కూడా శుభ్రం చేయడం లేదు. పంచాయతీ అధికారులు ఏ ఒక్కరూ తండాకు రావడం లేదు. అధికారులు తండాను సందర్శించి, చెత్తా చెదా రం లేకుండా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి.
– ధరావత్ సురేశ్ నాయక్, రెడ్యానాయక్ తండా, ధూళిమిట్ట మండలం,సిద్దిపేట జిల్లా