మునిపల్లి, మార్చి 20: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మునిపల్లి మండలంలోని కళ్లపల్లి-బెలూరు, చీలపల్లి గ్రామాల్లో పర్యటించిన ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహాకు ఈ గ్రామాల ప్రజలు క్రషర్ కంపెనీతో ఎదురవుతున్న ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. తాను గెలిస్తే ఈ సమస్య పరిష్కరిస్తానని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ప్రజలకు ఆనాడు దామోదర రాజనర్సింహా భరోసా ఇచ్చారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండున్నర ఏండ్లు గడుస్తున్నా, ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని మంత్రి దామోదర రాజనర్సింహపై కళ్లపల్లి-బెలూరు, చీలపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మునిపల్లి మండలం కళ్లపల్లి-బెలూరు గ్రామ శివారులోని క్రషర్ మిషన్లో చేపడుతున్న పేలుళ్లతో సమీపంలోని తమ ఇండ్లకు బీటలు ఏర్పడుతున్నాయని, ధ్వని కాలుష్యంతో పాటు ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని గామస్తులు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట క్రషర్ వద్ద పేలుళ్లు చేపడుతుండడంతో పెద్ద పెద్ద సౌండ్స్ వస్తుండడంతో జనం భయపడుతున్నారు. ఇటీవల బుధవారం రాత్రి ఇలాగే భారీ సౌండ్స్ రావడంతో స్థానికులు పరుగులు పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళ్లపల్లి-బెలూరు గ్రామ శివారులో నాడు మంత్రి దామోదర రాజనర్సింహా క్రషర్ కంపెనీ మూసివేస్తానని ఇచ్చిన హామీ సమయంలో ఇక్కడ ఒక్కటే క్రషర్ ఉండేదని, ప్రస్తుతం మరొక క్రషర్ ఏర్పాటు చేశారని గ్రామస్తులు తెలిపారు. అనుమతులు రాకుండానే కొత్తగా మరో క్రషర్ ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. ఒక్క క్రషర్తోనే తాము ఇన్ని ఇబ్బందులు పడుతుంటే, ఇంకో క్రషర్ ఏర్పాటుతో తమకు మరిన్ని ఇబ్బందులు తప్పవని కళ్లపల్లి-బెలూరు, చీలపల్లి గ్రామస్తులు వాపోతున్నారు.
క్రషర్ నిర్వహణతో సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని 2024లో మునిపల్లి మండల ప్రత్యేకాధికారి దశరథ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కళ్లపల్లి-బెలూరు శివారులోని క్రషర్ పనులు చేపట్టకుండా నోటీసులు ఇచ్చారు. అధికారులు ఇచ్చిన నోటీసులను క్రషర్ కంపెనీ నిర్వాహకులు చెత్తబుట్టలో పడేశారు. మమ్మల్ని ఎవరు ఏం చేస్త్తారులే అన్నట్టు ఇష్టారాజ్యంగా క్రషర్ నడిపిస్తూ, పేలుళ్లు చేపడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మంత్రి దామోదర రాజనర్సిహం, ఉన్నతాధికారులు స్పందించి క్రషర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.