రామాయంపేట : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ కమలహాసన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్ నుంచి బస్సు యాత్ర ‘ఇండియన్ యూత్ సెక్యూర్ ఆర్గనేషన్’ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామాయంపేట చేరుకుంది.
ఈ సందర్భంగా కమలాసన్ రెడ్డి, మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి రోడ్డు భద్రత బస్సును ప్రారంభించి మాట్లాడారు. వాహనాలపై తిరిగే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత పాటించాలన్నారు. మనం పాటించడమే కాకుండా ఇతరులకు కూడా చెప్పాలన్నారు. అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయన్నారు.
ఇండియన్ యూత్ సెక్యూర్ ఆర్గనైజేషన్ సంస్థ చేపట్టిన ఈ బస్సు యాత్ర నేటి నుండి 1000 రోజులపాటు ప్రధాన నగరాలతో పాటు కళాశాల, పాఠశాల విద్యార్థులకు రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పిస్తారని అన్నారు. రోడ్డు సేఫ్టీ సూచనల ద్వారా ప్రమాదాలను తగ్గించడమే కాకుండా క్రమశిక్షణను పెంపొందించుకోవచ్చు అన్నారు.